కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
అసెంబ్లీ తీర్మానం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పొలిటికల్ బ్లాక్ పేపర్
కేంద్రం ప్రతీ స్కీంకు కేటాయించే నిధుల్లో తెలంగాణ వాటా ఉందనే సోయి మరిచారా?
10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్ నిధుల కంటే కేంద్రం ఇచ్చిన నిధులే ఎక్కువ
కేంద్రం నిధులివ్వకుంటే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఏనాడైనా ఉద్యమాలు చేసిందా?
కేంద్రం నిధులివ్వలేదనడం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దడమే
బీఆర్ఎస్ మోసాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్కేంద్ర నిధులపై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయలేదు?
ఏ గ్రామానికైనా వెళదాం కేంద్ర నిధుల్లేకుండా పంచాయతీల్లో అభివ్రుద్ధి జరుగుతుందని నిరూపించే దమ్ముందా?
అసెంబ్లీల్ చర్చ జరిగితే వంద రోజుల్లో 6 గ్యారంటీల పేరుతో చేసిన మోసాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ డ్రామా
10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతి, అరాచకాలపై చర్చకు రాకుండా కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ఆడుతున్న నాటకమే
కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు లేదా విలీనానికి సంకేతమిది
కాంగ్రెస్ లో గులాబీ గుభాళింపు వెనుక మర్మమిదే
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ప్రశ్న ఆయుధం 24జులై హైదరాబాద్ :
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపట్ల వివక్ష చూపారని నిరసిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గం. తెలంగాణ రాష్ట్ర అభివ్రుద్దిలో కీలక భాగస్వామిగా ఉన్న కేంద్రాన్ని నిందిస్తూ తీర్మానం చేయడమంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లుగా ఉంది. ఇది పూర్తిగా ఆత్మహత్యా సద్రుశ్యమే. అసెంబ్లీలో చేసిన తీర్మానం పొలిటికల్ బ్లాక్ పేపర్ తప్ప మరొకటి కాదు.
మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను నిండా అప్పుల్లో ముంచి జీతాలివ్వడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా అంతో ఇంతో అభివ్రుద్ది జరిగిందంటే అది కేంద్ర నిధులతోనే అనే వాస్తవాన్ని విస్మరించడం బాధాకరం. గత పదేళ్లలో తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం దాదాపు రూ.10 లక్షల కోట్ల నిధులు వెచ్చించిందనే స్ర్పుహ లేకుండా నిందించడం విచారకరం. తెలంగాణలో గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్ నిధుల కంటే కేంద్రం నుండి వచ్చిన నిధులే ఎక్కువనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
భారతదేశంలో తెలంగాణ భాగమని, కేంద్రం ప్రతీ పథకానికి ఖర్చు చేసే నిధుల్లో తెలంగాణ వాటా ఉంటుందనే సోయి మర్చిపోయి ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు మాట్లాడటం వారి అవకాశవాదానికి పరాకాష్ట. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామ పంచాయతీకైనా వెళదాం. కేంద్ర వాటా లేకుండా ఏ పంచాయతీలోనైనా పాలన కొనసాగుతుందని, అభివ్రుద్ధి జరుగుతుందని నిరూపించే దమ్ముందా?
అట్లాగే అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రిసహా కాంగ్రెస్ సభ్యులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఏమీ చేయలేదని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ అందుకు నిరసనగా గత పదేళ్లలో తెలంగాణలో ప్రజాఉద్యమాలు ఎందుకు చేయలేదు? అట్లాగే అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాలనపై పలు శ్వేత పత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తెలంగాణకు ఖర్చు చేసిన నిధులపై ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.
100 రోజుల్లో 6 గ్యారంటీలుసహా అనేక హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. అదే సమయంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన మోసాలన్నీ ఒక్కొక్కటికీ బయటపడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో చర్చ జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసలు రూపం బయటకు వస్తుందనే భయంతో ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలో భాగమే కేంద్రాన్ని బదనాం చేస్తూ అసెంబ్లీ తీర్మానం. బీఆర్ఎస్ మోసాలపై శ్వేత పత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అదే పార్టీతో కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిందించేందుకు చేసిన పొలిటికల్ బ్లాక్ పేపర్ తప్ప మరొకటి కాదు.
ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాంగ్రెస్ లో చేరుతున్నారని భావించాం. కానీ అసెంబ్లీలో ఆ రెండు పార్టీలు కలిసి పోరాడతామంటూ ఆడుతున్న డ్రామాలను చూసిన తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అర్ధమవుతోంది. కాంగ్రెస్ లో గులాబీ వాసనలు గుభాళిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి ఇది సంకేతమా? లేక పొత్తుకు సిద్ధమయ్యాయా? అనే చర్చ ప్రజల్లో మొదలవడంతో కేంద్రాన్ని బదనాం చేసేందుకు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 8 8 = గాడిద గుడ్డు అంటూ విష ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం.