విద్యార్థుల భద్రతకు ఆటో రిక్షాలపై విస్తృత తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా నడిచిన వాహనాలు సీజ్
జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 30
కామారెడ్డి జిల్లాలో ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లు తదితర వాహనాలలో ప్రయాణించే విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లను సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉదయ్ కుమార్, మధు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల రవాణా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపే సమయంలో వారు సురక్షితంగా ప్రయాణిస్తున్నారా అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అలాగే రహదారి భద్రతా నియమాలను పాటించేలా రవాణా శాఖకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.