తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
నూతన సంవత్సరం వేడుకలు చట్టానికి లోబడి జరుపుకోవాలి
కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ నరహరి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31
నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా, బాధ్యతతో, చట్టానికి లోబడి జరుపుకోవాలని కామారెడ్డి పట్టణ ప్రజలకు టౌన్ ఇన్స్పెక్టర్ నరహరి విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక ఆనందం కోసం విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. డిసెంబర్ 31 సందర్భంగా పట్టణ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం వేడుకల పేరిట డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ బాక్సులు వినియోగించి ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే, వాహనం నడిపిన మైనర్‌తో పాటు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా, సురక్షితంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించాలని సూచించారు. మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే, మీరు బాధ్యతగా ఉండాలని ఇన్స్పెక్టర్ నరహరి పిలుపునిచ్చారు.