ప్రణాళిక బద్ధమైన చదువుతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యం
– చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు
ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31
క్రమశిక్షణతో, ప్రణాళిక బద్ధంగా చదువుకున్నప్పుడే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ సూచించారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మానసిక ఆరోగ్యం, మత్తు పదార్థాల నిరోధంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ, ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో నేరుగా చర్చించారు. ఈ సందర్భంగా డా. రమణ మాట్లాడుతూ… పరీక్షా కాలంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక ఆరోగ్యం కాపాడుకునేందుకు పాటించాల్సిన అంశాలను వివరించారు. ఈ వయస్సులో ఎదురయ్యే ఆకర్షణలకు లోనుకాకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. టీనేజీ దశలో ఎదురయ్యే మానసిక సమస్యలు, ఒత్తిడులకు కారణమయ్యే అంశాలపై విద్యార్థులతో చర్చించి, వారి సందేహాలకు సమాధానాలు తెలిపారు. అనంతరం ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లల్లో, పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలకు బానిసైన వారి వివరాలను అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం పెట్టి, చెడు అలవాట్లకు ముఖ్యంగా మొబైల్ ఫోన్ వ్యసనానికి దూరంగా ఉండాలని హితవు పలికారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల నిరోధకం, పొగాకు వాడకంపై జిల్లా సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా. రాహుల్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మానసిక సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 14416, మత్తు పదార్థాలపై సమాచారం ఇవ్వాలంటే 14446 ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కమల, ఉపాధ్యాయులు సత్యం తదితరులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.