తొలిసారి ఇడ్లీని రుచి చూసిన రష్యా యువతి! ఆమె రియాక్షన్ చూస్తే..
ఇడ్లీ సాంబార్.. కొందరికి ఈ కాంబినేషన్ పేరు చెబితే నోరు ఊరిపోతుంది. మరికొందరు మాత్రం ముఖం చిట్లించుకుంటారు. చప్పిడి ఇడ్లీని ఎవరు తింటారని ఎదురు ప్రశ్నిస్తారు. భారతీయ వంటకాల గురించి కాస్త పరిచయం ఉన్న విదేశీయులు కూడా ఇడ్లీలంటే పెదవి విరుస్తారు. మసాలా దోసకు మించినది లేదంటారు. ఇడ్లీ గురించి ఇలా అనేక అభిప్రాయాలు విన్న ఓ రష్యా యువతి ముంబైలో తొలిసారిగా దాన్ని రుచి చూసింది. ఫస్ట్ టైం ఇడ్లీ రుచి చూశాక ఆమె ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.ముంబైలో స్ట్రీట్ ఫుడ్ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతతో రష్యాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మారియా చుగురోవా ఇటీవల ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెకు ఓ ఇడ్లీ బండి తారస పడింది. అప్పటికే ఆమె ఇడ్లీ గురించి చాలా వినుంది. కొందరు దీని గురించి గొప్పగా చెబితే మరికొందరు మాత్రం పెదవి విరిచారు. చప్పిడి వంటకం అంటూ దెప్పిపొడిచారు. అయితే, ఇడ్లీ రుచి ఏంటో స్వయంగా తెలుసుకోవాలని అనుకున్న ఆమె ఇడ్లీ కనబడగానే ట్రై చేయాలని డిసైడ్ అయిపోయింది.స్థానికంగా సుధా అనే మహిళ ఆ ఇడ్లీ బండి నిర్వహిస్తోంది. ఆమె చేసిన ఇడ్లీని రుచి చూశాక ఇడ్లీపై తన అభిప్రాయం మారిపోయిందని చెప్పింది. ‘‘ఇడ్లీ రుచి చూడగానే నా అభిప్రాయం మారిపోయింది. ముఖంపై నవ్వు విరిసింది. ఇదో సర్ ప్రైజ్. సుధ లాంటి మహిళలే ఇలాంటి సర్ప్రైజ్లు ఇస్తారు. ఎంతో శ్రద్ధతో ఆమె చేసే ఇడ్లీల రుచి అమోఘం. నాకు ఇదో రకమైన మేలుకొలుపు. ఇకపై రోజూ ఇడ్లీలు తింటాను’’ అని చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఆమె ఈ వీడియో చేయగా నాటి నుంచీ అది ట్రెండింగ్లోనే కొనసాగుతోంది. ఇప్పటివరకూ 1.7 మిలియన్ వ్యూస్, 85 వేల పైచిలుకు కామెంట్స్ వచ్చాయి. అనేక మంది ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. ఇడ్లీ సరైన రీతిలో చేస్తే ఆ రుచే వేరని కామెంట్ చేశారు. అటు రుచి, ఇటు ఆరోగ్యం ఇచ్చే ఒకేఒక ఫుడ్ ఇడ్లీ అని కొందరు కామెంట్ చేశారు. కాగా, ఇన్స్టాలో చుగురోవా భారీ పాప్యులారిటీ సంపాదించుకుంది. ఆమెకు 3.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొంతకాలంగా భారత్లో ఉంటున్న ఆమె ఇక్కడ వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ వాటి విశేషాలతో వీడియోలను నెట్టింట షేర్ చేస్తుంటుంది.