వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు ప్రమాదం..?1

వైఎస్

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు ప్రమాదం!

ఆదిలోనే గుర్తించిన వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు……?

 

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బెయిల్‌ రద్దుకు పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. ఆయనపై చెల్లెలు షర్మిళకున్న వ్యతిరేకతను సొమ్ముచేసుకుని బెయిల్‌ రద్దు చేయించడానికి పెద్ద పన్నాగమే నడిచింది. ఆదిలోనే గుర్తించిన జగన్మోహన్‌రెడ్డి లీగల్‌గా ఒక స్టెప్‌ ముందుకు వేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. 

 

స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇస్తూ జగన్‌ ఎంఓయూ:

 

వైయస్సార్‌ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిళకు ఆస్తులు వచ్చాయి. వైయస్సార్‌గారి మరణం తర్వాత సీబీఐ కేసులు, ఈడీ కేసులతో వైయస్‌.జగన్‌ స్వార్జితానికి సంబంధించిన ఆస్తులు, కంపెనీలన్నీకూడా అటాచ్‌మెంట్లోకి వెళ్లిపోయాయి. అటాచ్‌మెంట్‌ కిందున్న ఆస్తులు బదిలీచేయడం కాని, విక్రయించడంకాని చట్ట విరుద్ధం. దీన్ని దృష్టిలో ఉంచుకుని, తన చెల్లెలితో ఉన్న అనుబంధం దృష్ట్మా, ప్రేమకొద్దీ తాను సొంతంగా సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలికి ఇవ్వాలని జగన్‌ నిర్ణయించుకున్నారు. కేసుల్లో ఆస్తులు ఉన్నందున వాటిని నేరుగా బదిలీచేయడానికి చట్టపరంగా ఆస్కారం లేనందున తన చెల్లెలకు నమ్మకం కలిగించేందుకు అవగాహనా ఒప్పందాన్ని, MOU జగన్‌ రాసిచ్చారు. ఇలా రాసిన ఆస్తుల్లో సరస్వతీ సిమెంట్స్‌ ఒకటి. కేసులు తేలిన తర్వాత వాటిని అప్పగిస్తామని అందులో పేర్కొన్నారు. 

 

కేసు ఏంటి? 

 

సరస్వతీ పవర్‌ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తికూడా అటాచ్‌మెంట్లోకి వెళ్లిపోయింది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. తన చెల్లెలపై ప్రేమకొద్దీ రాసిన MOUలో సరస్వతీ సిమెంట్స్‌లోకూడా షేర్లు ఇస్తానని జగన్‌ చెప్పారు. నేరుగా షర్మిలకు బదిలీ చట్టవిరుద్ధం కాబట్టి, నమ్మకంకోసం అప్పటికే 1శాతం వాటాదారుగా ఉన్న తల్లికి ఇస్తానన్న ఈ షేర్లపై గిఫ్ట్‌ డీడ్‌ రాసిచ్చారు. కేసులు తేలాక ఆ షేర్లను షర్మిల పేరుమీద బదిలీచేసుకోవచ్చని జగన్‌ ఈ గిఫ్ట్‌డీడ్‌ను 2019లో రాసిచ్చారు. కోర్టుకేసుల్లో, అటాచ్‌మెంట్లో ఉన్న ఆస్తిని నిర్వహించుకోవడానికే తప్ప ఏరకంగానూ క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీల్లేని నేపథ్యంలో జగన్‌, గిఫ్ట్‌ డీడ్‌కు పరిమితం అయ్యారు. 

 

కోర్టుల్లో కేసులు.. విరుద్ధంగా షేర్ల బదిలీ:

 

తర్వాత కాలంలో షర్మిళకు రాజకీయంగా ఆకాంక్షలు మొదలయ్యాయి. రాజకీయంగా తానుకూడా ఉండాలని షర్మిల పట్టుబడుతూ వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వాటి తీవ్రత నేపథ్యంలో జగన్‌కు ఇష్టంలేకపోయినా తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు. తర్వాత హఠాత్తుగా అక్కడ నుంచి ఆపార్టీని మూసేసి మళ్లీ ఏపీలో కాంగ్రెస్‌కు అధ్యక్షురాలు అయ్యారు. తదనంతరం జగన్‌గారిని రాజకీయంగా వ్యతిరేకించి, ఆయన్ను నిరంతరం ఇబ్బందులు పాలుచేసే వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశాలయ్యాయి. ఏకంగా జగన్‌నే టార్గెట్‌చేస్తూ పలు సందర్భాల్లో ఆమె మాట్లాడిన మాటలు రాజకీయ వేడికి కారణమయ్యాయి. ఇదే సందర్భంలో సరస్వతీ పవర్‌లో జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గరనుంచి షేర్లను బదిలీచేయించుకున్నారు. 

 

న్యాయవాదుల సూచనలతో జాగ్రత్త పడ్డ జగన్‌:

 

కోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈపరిణామం లీగల్‌గా పెద్ద ఇబ్బంది తెచ్చిపెడుతుందని జగన్‌ను న్యాయవాదులు హెచ్చరించారు. దీన్ని ఆసరాగా తీసుకుని బెయిల్‌ రద్దుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుకూడా విశ్వసనీయ వర్గాల ద్వారా జగన్‌కు సమాచారం అందినట్టు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల వైయస్‌.సునీత చంద్రబాబునాయుడిని కలిసిన సందర్భంలో ఈ అంశంపై చర్చకు వచ్చిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. న్యాయవాదుల సూచనలతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్‌ లీగల్‌గా ఒక అడుగు ముందుకేయాల్సి వచ్చింది. 

 

తర్వాత జగన్‌ ఏంచేశారు?:

 

తనకు తెలియకుండా, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వ్యవహారంపై జగన్‌ వెంటనే తన తల్లికి, చెల్లెలకు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. తాను ప్రేమకొద్దీ నమ్మకంతో ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను వినియోగించుకుని, షేర్ల బదిలీ చేయడం సరికాదని తెలిపారు. ఇది నమ్మకాన్ని వమ్ముచేయడమంటూ స్పష్టంచేశారు. 

 

చంద్రబాబు అజెండాను షర్మిళ మోస్తున్న విషయాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ఈసందర్భంలో ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత షర్మిళ వైఖరి ఏంటో ప్రజలందరికీ తెలుసని, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని అడ్డుపెట్టుకుని, ఈ విషయంలో షర్మిళను వాడుకుని, జగన్‌గారిని రాజకీయంగా కొట్టిపడేయడానికి రాజకీయ ప్రత్యర్థులు వెనుకాడరని పార్గీలు వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్‌.జగన్‌ న్యాయపరంగా అడుగు ముందుకేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. 

 

నమ్మకం సంపాదించుకుంటే.. మళ్లీ చెల్లికే:

 

ముప్పును ముందుగానే గుర్తించి జగన్‌ జాగ్రత్తపడ్డారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి విషయాల్లో బంధుత్వాలపై మమకారం అంటూ నిర్లక్ష్యంచేస్తే మళ్లీ లీగల్‌ ఇబ్బందులు వస్తాయని, అది పార్టీకి, తద్వారా పార్టీని నమ్ముకుని ఉన్న జనానికి, పార్టీ నాయకులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడతాయన్న ఆలోచనతోనే ఈచర్యకు దిగినట్టు పార్టీవర్గాలు వెల్లడిస్తున్నాయి. మళ్లీ నమ్మకాన్ని సంపాదించుకుంటే ఆ కంపెనీ షేర్లను ఇవ్వడానికి తాను సిద్ధమేనంటూ తన చెల్లెలికి జగన్‌ చెప్పిన మాటను పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి.

Join WhatsApp

Join Now