Headlines
“కేటీఆర్ ఆగ్రహం: గ్యారెంటీల మోసం బయటపడిందా? కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు”
ఈ సంగతి ఇప్పుడు తెలిసిందా?
ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
ఖర్గేజీ.. గ్యారెంటీలతో మొదటికే మోసమని ఇప్పుడర్థమైందా?
గాలి హామీలిస్తే ఆర్థిక సంక్షోభమేనని ఇప్పుడు బోధపడిందా?
తెలంగాణలో తప్పు చేస్తున్నప్పుడు గుర్తు రాలేదు ఎందుకు?
ఒక్క ఏడాదిలోనే రాష్ర్టానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది
ఈ పతనం నుంచి కోలుకోవడం ఇక అసాధ్యమే: కేటీఆర్
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో తెలంగాణ ఏడాదిలోనే ఆగమైంది.. ప్రజలను నమ్మించి నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని గ్యారెంటీలను ప్రకటించి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గాలిమాటల గ్యారెంటీలతో మొదటికే మోసం వస్తుందన్న విషయం కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు అర్థమయిందా? అంటూ దుయ్యబట్టారు. గ్యారెంటీల మాటున తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కర్ణాటక గ్యారెంటీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని, వాటిని అమలు చేస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని నిప్పులు చెరిగారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా? అని ఆరు గ్యారెంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? అని నిలదీశారు. అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందని ఇప్పటికైనా మల్లికార్జున ఖర్గే గుర్తించినందుకు సంతోషమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో త్వరలో పాదయాత్ర
కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందని, అన్ని రంగాల్లో తెలంగాణ వెనక్కి వెళ్లిందని, పాలన మొత్తం ఫ్రం ఢిల్లీ, టు ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్టుగా తయారైందని కేటీఆర్ విమర్శించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని వెల్లడించారు. దీపావళి సందర్భంగా నెటిజన్లతో ఎక్స్ వేదికగా గురువారం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో గంటన్నరపాటు సాగిన ఇష్టాగోష్ఠిలో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పార్టీలను బలోపేతం చేసేందుకు దేశంలోని అనేక పార్టీల నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. మీరెప్పుడు చేస్తారు?’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందనగా ‘కచ్చితంగా పాదయాత్ర ఉంటుంది’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ర్టానికి కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని దుయ్యబట్టారు. ‘ఆదాయ వనరుల నుంచి మొదలుకొని రాష్ట్రంలో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లినయ్. నిరుద్యోగిత పెరిగింది.. రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోతున్నయి. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నయో తెల్వది. కాంగ్రెస్ పాలన వల్ల జరిగిన, జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. పది నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేసిన ఒక మంచిపని కూడా గుర్తుకు రావడం లేదని ఎద్దేవాచేశారు. అబద్ధపు హామీలతో ఎన్నికైన కాంగ్రెస్ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమని దుయ్యబట్టారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులకు దిగుతున్నారని విమర్శించారు. అలాం టి వేధింపులకు తాము భయపడేది లేదని తేల్చిచెప్పారు. దొడ్డువడ్లకూ బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ బోగస్‌గా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి మద్దతు ధరలేక, రైతుబంధు రాక నష్టపోతున్న రైతుల తరఫున పోరాడుతామని స్పష్టంచేశారు. నాలుగేండ్ల తర్వాత కాంగ్రెస్‌కు అధికారం పోవడం ఖాయమని, ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు పోవడం కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారుతుందని పేర్కొన్నారు.
కుటుంబాలకు వేధింపులు
తాము అధికారంలో ఉన్న పదేండ్లలో ఏనాడూ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగలేదని కేటీఆర్ గుర్తుచేశారు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో తన కుటుంబసభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు ఈ రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురయ్యానని ఆవేదన వ్యక్తంచేశారు.
మూసీ పేరిట అతిపెద్ద స్కాం
చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ మీద గొప్పలు చెబుతున్నా అసలైన ఎజెండా అవినీతి మాత్రమేనని కేటీఆర్ పునరుద్ఘాటించారు. మూసీ బ్యూటిఫికేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన అనేది దేశంలోనే అతిపెద్ది సాం అని తెలిపారు. కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని హైడ్రా పనిచేస్తున్నదని, ఇప్పటి వరకు ఒక పెద్ద బిల్డర్‌ను కూడా హైడ్రా ముట్టుకోలేదని, పేద, మధ్యతరగతి ప్రజలను మాత్రం నిర్దయగా దోచుకున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఖర్గే..గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా? కర్నాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా? బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా? ఆరు గ్యారెంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఆ విషయాలు ఎందుకు గుర్తురాలేదు?
– కేటీఆర్
అద్భుతంగా వారియర్ల పనితీరు
ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలకంగా, చురుకైన పాత్ర పోషిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ తరఫున ఏం ఆశించకుండానే సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు. త్వరలోనే విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతి మీడియాకు ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమేనని స్పష్టంచేశారు.
కేసీఆర్ దిశానిర్దేశంలోనే మేము
తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం.. తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు నిలిచే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సరిపడా సమ యం ఇచ్చారని చెప్పారు. కొత్త సంవత్సరం తర్వాత కేసీఆర్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.
అంత ఊడిగం అవసరమా?
తమ విధులు మరిచి చట్ట విరుద్ధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు రెచ్చిపోతున్నారని, ఇక వేటినీ తాము విస్మరించబోమని కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీకి పోలీసులు ఊడిగం చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నరని అన్నివర్గాలు భావిస్తున్నాయి. అంత అవసరమా? రాజకీయ వేధింపుల విషయంలో ప్రభుత్వాధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొందరు పోలీసు అధికారులు బిజీగా ఉన్న రు. అందుకే తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయినయి’ అని మండిపడ్డారు. తమ హ యాంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించామని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలో నెలపాటు ఎలాంటి కారణం లేకుండా 163 సెక్షన్ విధించడం ఆందోళనకు గురిచేస్తున్నదన్నారు.
నీచమైన రాజకీయాల కోసం నా కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రిపై, ఆయన వందిమాగదులపై ప్రజల మద్దతుతో పోరాటం చేస్తా.. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వత నీచమైన రాజకీయ సంస్కృతి అత్యంత హీనమైన దశలో ఉన్నది. అదెంతో కాలం సాగదు.
– కేటీఆర్
దళారులతో సర్కార్ కుమ్మక్కు
దళారులతో కాంగ్రెస్ కుమ్మక్కయి రైతులను నిండా ముంచిందని కేటీఆర్ విమర్శించారు. వానకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదని మండిపడ్డారు. ‘కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ఐకేపీ కేంద్రాల్లోనూ కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్‌లో తలమునకలైండు’ అని ఎద్దేవాచేశారు. అకాల వర్షాలకు అనేకచోట్ల కల్లాలు, మారెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దవుతున్నా కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్రపోతున్నదని మండిపడ్డారు. వానకాలం సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్‌లో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, కేవలం 913 మంది రైతుల నుంచి 7,629 టన్నులే కొనుగోలు చేసిందని వివరించారు.
ఏదైనా జరగొచ్చు..
కాంగ్రెస్‌పై అప్పుడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని, రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్‌ను మార్చే అవకాశం ఉన్నదా? అని ఒకరు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్తూ మరో నాలుగేండ్లు వేచి ఉండాల్సిందేనని చెప్పారు. ఐదేండ్ల కోసం కాంగ్రెస్‌కు అవకాశమిచ్చిన నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని, తీర్పును గౌరవిస్తామని స్పష్టంచేశారు. ప్రస్తుత సీఎం పూర్తికాలం పదవిలో ఉంటారా లేదా? ఓటుకు నోటు కేసుతో బీజేపీలోకి వెళ్తాడా? అని ఒకరు అడిగిన ప్రశ్నకు రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందని బదులిచ్చారు. కాంగ్రెస్ చరిత్ర చూస్తే ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చని తెలిపారు.
పదేండ్లుగా ప్రగతి పథంలో పరుగులు పెట్టిన తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలి. అనాలోచితంగా ఇచ్చిన కాంగ్రెస్ గ్యారెంటీలతో భవిష్యత్తు తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి.. ఏడాదిగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిది! గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది!
– కేటీఆర్
నోట్ దిస్పాయింట్..
గంటన్నరపాటు ఏకధాటిగా సాగిన ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమంలో అనేక అంశాలపై కేటీఆర్ స్పష్టమైన వైఖరి వెల్లడించారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి..
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని, ఆ రెండు పార్టీల నాయకులు అనేక అంశాల్లో చెట్టాపట్టాలేసుకొని కుమ్మక్కయ్యారని, ఇది ప్రజలందరికీ తెలిసిపోయిందని కేటీఆర్ చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి పక్కకు తప్పుకుంటున్న కాంగ్రెస్ లాంటి పార్టీలపై చర్యలు తీసుకునేందుకు, ప్రజలను పదే పదే చేస్తున్న మోసాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంసరణలు అవసరమని చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మొద్దని, స్థానిక పార్టీలకు ఓటువేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడు విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ, వైఎస్సార్సీపీ అగ్ర నాయకులందరితో రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే గాని, వ్యక్తిగతంగా అందరితో మంచి అనుబంధం ఉన్నదని స్పష్టంచేశారు.
ప్రజలే సాధారణ వ్యక్తులను నాయకులుగా తయారు చేస్తారని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండే అవకాశం వల్ల తమకు నిబద్ధత కలిగిన, బలమైన కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం వచ్చిందని, పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని గత ఎన్నికల్లో ఓటమి తమకు నేర్పిందని, కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల్లో అవాస్తవికమైన ఆశలను రేకెత్తించాయని తెలిపారు. వరుసగా రెండుసార్లు గెలవడంతో యాంటీ ఇన్‌కంబెన్సీ కూడా తమ ఒటమికి కొంత కారణమని చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలున్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని చెప్పారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం బీజేపీ చేస్తున్న మరో జుమ్లా అని, ఆ చట్టం ఎలాంటిదో వేచి చూడాలని, అదే సమయంలో వ్యక్తిగతంగా అది అసాధ్యమని తెలిపారు.
గ్రూప్-1 అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.