3 నెలల్లోఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ మంత్రి

 

రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అక్కడి కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిబంధనలకు లోబడి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని సూచించిన మంత్రి.. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను తీసుకుంది.అప్పట్లో 25.70లక్షలు రాగా అందులో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6లక్షలు, అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటి పరిధిలో 1.35లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తుదారులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారని, వీటి పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భూముల క్రమబద్ధీకరణలో అక్రమాలకు తావులేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న మంత్రి.. దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు..

Join WhatsApp

Join Now