హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టిన భారత్
భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు..
ఈ పరీక్షతో భారత్ కూడా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో చేరింది.
1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. వివిధ రకాల వార్హెడ్లను అమర్చేలా దీనిని డిజైన్ చేశారు. ”దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలురాయిని దాటింది. ఈ పరీక్ష ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్‌లో జరిగింది. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లైంది” అని ఎక్స్‌లో రక్షణ శాఖ పోస్టు చేసింది. పరీక్షకు సంబంధించిన వీడియోను కూడా జత చేసింది.
ఈ పరీక్ష సమయంలో క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా ట్రాక్ చేశారు. చివరి దశలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డీఆర్డీవో వెల్లడించింది. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిసైల్ కాంప్లెక్స్‌లో దీనిని రూపొందించారు. దేశంలోని ఇతర డీఆర్డీవో ల్యాబ్‌లు, పరిశ్రమలు సహకరించాయి. సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరిగింది..