గ్రామాల్లో నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదు

గ్రామాల్లో
Headlines :
  1. “లగచర్ల భూసేకరణ: రైతులకు న్యాయం చేయాలని వామపక్షాల డిమాండ్”
  2. “ఫార్మాసిటీ కోసం భూములు సేకరణ: 2013 చట్ట ప్రకారమే పరిహారం ఇవ్వాలి”
  3. “వామపక్షాల హెచ్చరిక: లగచర్ల భూసేకరణ రాష్ట్రవ్యాప్త సమస్య అవుతుంది”
  4. “మూసీ ప్రక్షాళనను రియల్‌ ఎస్టేట్‌ దందాగా మారనివ్వం – వామపక్ష నేతలు”
  5. “వ్యవసాయేతర భూముల్లో పరిశ్రమలు: వామపక్ష నేతల సూచనలు”

21న లగచర్లకు వెళ్తాం

– వామపక్ష నేతల పర్యటనను అడ్డుకోవద్దు

– సమస్యను పరిశీలించి పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తాం

– గ్రామాల్లో నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదు

– ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దు

– వ్యవసాయేతర భూములనే పరిశ్రమలకు తీసుకోవాలి

– 2013 చట్టం ప్రకారమే పరిహారమివ్వాలి

– భూసేకరణపై ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం తగదు

– అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

రాష్ట్రంలో వికారాబాద్‌ జిల్లాలో ఫార్మా సంస్థ కోసం 1,375 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అందులో 600 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందనీ, మిగతాది రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించిందన్నారు. ఇందుకు ప్రజాస్వామ్య పద్ధతిని పాటించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడం సరైంది కాదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడి చేయడాన్ని ఖండించారు. భౌతిక దాడి పరిష్కారం కాదన్నారు. అయితే ఘటన తర్వాతైనా సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని సూచించారు. కానీ లగచర్ల పరిసర గ్రామాల్లో నిర్బంధాన్ని ప్రయోగించడం, ఇంటర్‌నెట్‌ను బంద్‌ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రైతాంగానికి అండగా నిలబడేందుకు బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఈనెల 21న లగచర్లకు వామపక్ష నేతలు వెళ్తారని చెప్పారు. తమను వెళ్లనివ్వకుంటే లగచర్లకు పరిమితమైన సమస్య రాష్ట్ర వ్యాప్తమవుతుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లగచర్ల పరిసర గ్రామాల్లో అధికారులపై దాడి తర్వాత భయానక వాతావరణం ఉందన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి బీఆర్ఎస్‌కు చెందిన వారినే జైలుకు పంపించారని అన్నారు. ఎవరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనివ్వడం లేదన్నారు. ఎందుకంత నిర్బంధమని అడిగారు. నిర్బంధ చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. గ్రామాలనే జైళ్లలాగా మార్చారనీ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని కోరారు. సమస్యను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించాలని సూచించారు. ఈనెల 21న లగచర్లకు వెళ్లి బాధిత రైతాంగాన్ని కలిసి వాస్తవ పరిస్థితులను పరిశీలించి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వారికి న్యాయం చేయాలని కోరతామన్నారు.

ఇబ్రహీంపట్నంలో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 15 వేల ఎకరాలను సేకరించిందని చెప్పారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేపట్టామని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫార్మా సిటీని రద్దు చేస్తామనీ, ఆ భూములను రైతులకు తిరిగి ఇస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇంకా ఆ భూమిని రైతులకివ్వలేదని చెప్పారు. ఇప్పుడు ఫార్మాసిటీకి చెందిన 15 వేల ఎకరాలకు మరో 15 వేల ఎకరాలు కలిపి మొత్తం 30 వేల ఎకరాల్లో ఫోర్త్‌ సిటీని నిర్మిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని వివరించారు. విదేశీ సంస్థలకు ఆ భూములను కట్టబెట్టడం కోసమేనని విమర్శించారు. ఇది ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, దామగుండం రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు, గ్రూప్‌-1 వివాదం, ఫార్మాసిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవడం లేదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచించాలని కోరారు. లగచర్లకు వెళ్లిన వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు.

వామపక్ష నేతలకు రైతులను కలిసే అవకాశం ఇవ్వాలనీ, లేకుంటే రాష్ట్రవ్యాప్త సమస్యగా మారుతుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు కోసం జరిగే భూసేకరణ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. లగచర్ల దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందా? లేదా? అనే అంశంపై పరిశీలించాల్సి ఉందన్నారు. భూములు కోల్పోయే వారిలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన రైతులున్నారని వివరించారు. వ్యవసాయానికి పనికిరాని భూములనే పరిశ్రమలకు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ కోసం 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూసేకరణ కోసం బీఆర్ఎస్‌ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందన్నారు. అది రైతులను దోపిడీ చేయడమేనని అన్నారు. ఎకరా భూమి మార్కెట్‌ విలువ రూ.50 లక్షలుంటే, ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తే ఎలా?అని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్‌, కేటీఆర్‌ ఏం కుట్ర చేశారో కానీ, ప్రజలపై ప్రభుత్వం కుట్ర చేయొద్దని కోరారు. రైతులు క్షేమంగా ఉండాలని చెప్పారు. మత విశ్వాసాలను వ్యతిరేకించబోమని అన్నారు. మత విశ్వాసాలున్న ప్రజల కోసం కమ్యూనిస్టులు పనిచేయాలని అన్నారు. భక్తుల్లో కూడా తమ సంఘం ఉండాలన్నారు. పూజారుల సంఘం పెడతామని చెప్పారు. తిరుపతిలో పూజారుల సంఘం, ఇతర కార్మిక సంఘం ఏర్పాటు చేసి హక్కుల కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. మతాన్ని వ్యక్తిగతంగా చూడాలని కోరారు. లౌకికవాదం అంటే పరిపాలనా, రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావొద్దని సూచించారు. కమ్యూనిస్టు రాజ్యాల్లోనూ మతాలున్నాయని గుర్తు చేశారు. మూసీ పరిధిలో ఆక్రమించిన వాటిని తొలగిస్తే అభ్యంతరం లేదన్నారు. కానీ పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుక్కున్న ఇండ్లను కూల్చడం సరైంది కాదన్నారు.

చట్టబద్ధంగా మున్సిపల్‌ అధికారులు అనుమతి ఇచ్చారనీ, విద్యుత్‌, నల్లా కనెక్షన్లున్నాయని వివరించారు. వాటికి అనుమతిచ్చిన ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజల వల్ల మూసీ కాలుష్యం కావడం లేదనీ, ఫార్మా పరిశ్రమల వల్లేనని అన్నారు. నష్టపరిహారం, డబుల్‌బెడ్రూం ఇండ్లు ఇచ్చిన తర్వాతే పేదల ఇండ్లను కూల్చివేయాలని డిమాండ్‌ చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కోసం భూమిని కోల్పోయిన రైతులు ఇంకా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు.

మూసీ ప్రక్షాళనను రియల్‌ ఎస్టేట్‌ దందాగా మార్చొద్దు: వీరయ్య

మూసీ ప్రక్షాళన పేరుతో 12 వేల పేదల ఇండ్లను ఇరువైపులా తొలగించడం సరైంది కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య అన్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం,హోటళ్లు నిర్మించడం కోసమే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదా అనే అనుమానా లకు తావివ్వ కూడదని సూచించారు. మూసీ పక్కన ఒక్క ఇల్లునూ తొలగించడానికి వీల్లేదన్నారు.రెండువైపులా పెద్దగోడలు నిర్మించాలని సూచించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఘట్‌కేసర్‌ నుంచి సూర్యాపేట వరకు వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. ఆహార పదార్థాలు,నీరు కలుషితమవుతున్నాయని అన్నారు.మూసీ ప్రక్షాళన, సుందరీకరణను రియల్‌ ఎస్టేట్‌ దందాగా మార్చొద్దని డిమాండ్‌ చేశారు.

పరిశ్రమలకు వ్యతిరేకం కాదు : జూలకంటి

రామన్నపేట వద్ద అదానీ సంస్థ సిమెంటు పరిశ్రమను నెలకొల్పడం కోసం భూమిని కేటాయించడాన్ని పార్టీలకతీతంగా రైతులంతా ఏకమై వ్యతిరేకించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి చెప్పారు. పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆ ప్రాజెక్టు వద్దంటూ ప్రజలు, రైతులు ప్రతిఘటిస్తున్నారని వివరించారు. వ్యవసాయ భూములు కాకుండా, వ్యవసాయేతర భూముల్లో పరిశ్రమలను పెట్టాలని సూచించారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్‌ ధర ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు, రైతులు నష్టపోకుండా త్రిబుల్ఆర్‌ భూసేకరణను చేపట్టాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment