అమ్మకానికి ప్రభుత్వ బ్యాంక్‌ల వాటాలు
నాలుగింటిలో విక్రయానికి కేంద్రం యోచన
ముంబయి: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి మోడీ సర్కార్ మళ్లీ తెరలేపుతోంది. తాజాగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో మైనారిటీ వాటాలను ప్రయివేటు శక్తులకు విక్రయించడానికి వీలుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ల్లో వాటాలను ఉపసంహరించుకోనుందని రాయిటర్స్ ఓ రిపోర్టులో తెలిపింది. త్వరలో జరగన్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆయా బ్యాంక్‌ల్లో వాటాల విక్రయానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల పేరుతో వాటాల అమ్మకాన్ని తెరమీదకు తెస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ ముగింపు నాటికి సెంట్రల్ బ్యాంక్‌లో కేంద్రానికి 93 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 96.4 శాతం, యుకో బ్యాంకులో 95.4, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 98.3 శాతం చొప్పున వాటాలున్నాయి. ఓపెన్ మార్కెట్లో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా వాటాల విక్రయం పరిశీలనలో ఉందని అధికార వర్గాల సమాచారం. లిస్టెడ్ కంపెనీల్లో 25 శాతం వాటాలను విక్రయించాలని సెబీ నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఈ నిబంధన నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు 2026 ఆగస్ట్ వరకు మినహాయింపు ఉంది. అయినప్పటికీ మోడీ సర్కార్ ఎప్పటిలాగానే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను విక్రయించడానికి ఆసక్తిగా ఉందని స్పష్టమవుతోంది. వాటాల విక్రయంపై బ్యాంక్ అధికారులు, ఆర్థిక శాఖ వర్గాలు అధికారికంగా స్పందించడానికి నిరాకరించాయి.