ఇక ఎంపీ ప్రియాంక గాంధీ.. ప్రచారకర్త నుంచి పార్లమెంట్‌ వరకు..

ఇక ఎంపీ ప్రియాంక గాంధీ.. ప్రచారకర్త నుంచి పార్లమెంట్‌ వరకు..* 

* వయనాడ్‌ లోక్‌సభ స్థానంలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు.

  ‘‘ప్రజా ప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్తేమో గానీ.. ప్రజల తరఫున పోరాటం నాకేం కొత్త కాదు. 30 ఏళ్లుగా నేను గృహిణిని.. నా గొంతు ఎంత పెద్దదో నా భర్తని అడిగితే చెబుతారు. ఇప్పుడు మీకో ఫైటర్‌ కావాలి.. మీరు అవకాశమిస్తే మీ తరఫున గళమెత్తడానికి నా గొంతుక వినిపిస్తా..’’ కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఈ మాటలే వయనాడ్‌ ప్రజలను ఆకట్టుకున్నాయి. అందుకే వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కట్టబెట్టి పార్లమెంట్‌కు పంపిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం గాంధీ-నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమైన ప్రియాంక.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. నానమ్మ ఇందిరా గాంధీ పోలికలతో… నేత చీరల్లో ప్రచారకర్తగా మొదలైన ఆమె రాజకీయ ప్రయాణం.. ఎంపీ వరకు ఎలా సాగిందంటే..?

చెప్పింది ఒక్క మాటే అయినా..

అది.. 1998 జనవరి 26. తల్లి సోనియా గాంధీతో కలిసి తమిళనాడులోని ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. ఆ సభలో ఆమె ‘ఎల్లారుం కాంగ్రెసిక్కు ఓట్‌ పొడుంగల్‌ (అందరూ కాంగ్రెస్‌కు ఓటెయ్యండి)’ అంటూ తమిళంలో చెప్పారు. ఓ రాజకీయ సభలో వేదికపై మాట్లాడటం ఆమెకు అదే తొలిసారి. ఆమె మాట్లాడింది ఒకే ఒక్క వాక్యమైనా.. నాటి ప్రచారంలో సోనియా కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించారు ప్రియాంక. అప్పటికి రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోయినా తల్లి సోనియాకు అడుగడుగునా అండగా ఉంటూ వచ్చారు. ఆమెకు అడ్వైజర్‌గా ఉంటూ తల్లికి రాజకీయ ప్రసంగాల్లో సాయం చేశారు.

రాజకీయ ప్రయాణం మొదలైందిలా..

సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2004లో ప్రియాంక తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. క్రియాశీల రాజకీయాల్లో ఉండకపోయినా.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌ గాంధీ తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ వెలుపలా కొన్ని చోట్ల ర్యాలీల్లో కన్పించారు. అయితే, ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మాత్రం 2019లోనే..! ఈ ఏడాది జనవరిలో ఆమె ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది మొత్తం యూపీకి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్నారు.

పార్టీ అధ్యక్ష పీఠాన్ని కాదని..

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్‌ గాంధీ వైదొలిగారు. ఆ సమయంలో ప్రియాంక ఆ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్‌లో డిమాండ్లు వినిపించాయి. సీనియర్‌ నేతలు కూడా ఒక దశలో ఆమె వైపు మొగ్గుచూపారు. కానీ, ప్రియాంక దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానెత్తుకున్నారు. రాష్ట్రమంతటా తిరిగి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. ప్రియాంక ప్రచారం మాత్రం మెప్పించింది.

ఆ విజయంతో దేశం దృష్టిని ఆకర్షించి..

యూపీలో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత 2022 చివర్లో జరిగిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంక యావత్‌ దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో తెరవెనుక ఆమె అన్నీ తానై పార్టీని నడిపించి విజయాన్నిందించారు. అప్పటి నుంచి పార్టీలో కీలక ప్రచారకర్తగా మారిపోయారు. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లోనూ చురుగ్గా పాల్గొని పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తల్లి సోనియా ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి సోనియా ప్రత్యక్ష ఎన్నికల అరంగేట్రం చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా అక్కడి నుంచి రాహుల్‌ బరిలోకి దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం కోసమే అప్పట్లో ప్రియాంక పోటీకి దూరంగా ఉన్నారు.

అన్న రికార్డ్‌ను దాటి.. అఖండ మెజార్టీతో అరంగేట్రం..

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి విజయం సాధించిన రాహుల్‌.. ఆ తర్వాత వయనాడ్‌ వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమవగా.. ప్రియాంక గాంధీ పోటీ చేశారు. ప్రచారంలో తన మార్క్‌తో దూసుకెళ్లారు. ‘ఆమె స్థానికేతరురాలు’ అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలకు.. ‘ప్రజలు గెంటేసే వరకు వెళ్లిపోను’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. మహిళ, యువత సమస్యలను ప్రధానంగా ఎత్తిచూపుతూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్‌ గాంధీ సాధించిన 3.64లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక (3.82లక్షల ఓట్ల పైచిలుకు) దాటేశారు. 

నానమ్మ ఇందిరలాగే..

‘నా తల్లిలాగే ప్రియాంక కూడా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి’ అని ఆమె తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మాటలను నిజం చేస్తూ ఆహార్యంలోనూ, ఆచరణలోనూ ప్రియాంక ఎక్కువగా తన నానమ్మ ఇందిరా గాంధీలా ఉండటానికే ఇష్టపడతారు. పోలికలూ, ఆహార్యంతోపాటు వాగ్ధాటిలోనూ ఆమె ఇందిరమ్మ వారసురాలే అని నిరూపించుకున్నారు.

Join WhatsApp

Join Now