సర్కారు దవాఖానాల్లో మందుల కొరత లేకుండా చూడాలి

హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖ ప్రతి జిల్లాకో డ్రగ్‌ స్టోర్‌ మంజూరు చేసిన నేపథ్యంలో సర్కారు దవాఖానాల్లో మందుల కొరత లేకుండా చూడాలని ఆ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఔషధాల సరఫరా, ఆహార భద్రత అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 22 సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్ల పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల కొరతపై ఉమ్మడి జిల్లాల్లోని టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీలు చేసిన ఇచ్చిన నివేదికపై సమీక్షించారు. మెడిసిన్‌ ఇండెంట్‌ దగ్గర్నుంచి రోగులకు చేరే వరకూ సరఫరాను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒకరిని బాధ్యులుగా నియమించాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఈ- ఔషధి’ పోర్టల్‌ వినియోగంపై ఫార్మసిస్టులకు కార్యశాల నిర్వహించాలన్నారు. సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌లోకి వచ్చే మందులు, బయటకెళ్లేవాటి వివరాలను కచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాల్లో మెడిసిన్‌ సరఫరా బాధ్యతలను డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు అప్పగించాలని మంత్రి ఆదేశించారు.ఆహార భద్రతలో హైదరాబాద్‌ దేశంలోనే చివరి స్థానంలో ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. కొంత మంది 2022 నాటి డేటాతో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ మంత్రికి వివరించారు. ఫుడ్‌ సేఫ్టీకి సంబంధించి నమోదైన కేసుల ఆధారంగా, నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో 2023 డిసెంబరులో నివేదిక విడుదల చేసిందని ఆయన తెలిపారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, వైద్య విద్య సంచాలకురాలు డాక్టర్‌ వాణి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్, పబ్లిక్‌ హెల్త్‌ విభాగం అదనపు సంచాలకుడు అమర్‌సింగ్‌ నాయక్‌  పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now