Headlines :
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – కీలక చర్చలకు ముహూర్తం
-
5 బిల్లులు, 2 నివేదికలతో అసెంబ్లీలో ఉత్కంఠభరిత చర్చలు
-
ఆర్వోఆర్ 2024 బిల్లు – ప్రతిపక్షాల విమర్శలకు కాంగ్రెస్ జవాబులు
-
రైతు భరోసా అమలుపై అసెంబ్లీలో చర్చకు రంగం సిద్ధం
-
బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహాల మధ్య అసెంబ్లీ చర్చలు వేడెక్కనున్నాయి
*నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు*
*-సభ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు*
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10.30 గంటలకు మొదలు కానున్నాయి. ఇప్పటికే సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆదివారం సాయంత్రం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన తన ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బండా ప్రకాశ్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేశ్ భగవత్, నిఘా విభాగం అధిపతి శివధర్ రెడ్డిలతో పాటు ముగ్గురు నగర సీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలతో పాటు ఇవాళ్టి నుంచి జరగనున్న సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సభ్యులు సమాచారం అడిగిన వెంటనే జాప్యం లేకుండా తక్షణమే సరైన వివరాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాసనసభ సమావేశాల్లో ఏయే అంశాలు చర్చకు పెట్టాలి? ఏయే అంశాలు బిల్లుల రూపంలో సభలో పెట్టాలి? అన్నది బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. రైతుల సమస్యలు, గురుకులాల్లో నెలకొన్న ఇబ్బందులు, లగచర్ల భూ సేకరణ సమస్య, ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేఖత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే అవకాశం ఉంది.
*ఆర్వోఆర్ -2024 బిల్లు…*
అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు అవుతున్న హామీలు, అమలు చేయాల్సిన హామీలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతి వ్యూహాలపై చర్చించింది. బీజేపీ కూడా ఇదే తరహాలో సభలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీసే అవకాశం ఉంది. మరొకవైపు అధికార కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై దీటుగా సమాధానం చెప్పేందుకు అవసరమైన సమాచారంతో సిద్ధమైంది. ప్రధానంగా ఆర్వోఆర్ 2024 చట్టానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పెట్టనుంది.
అదేవిధంగా కుల గణన గణాంకాలను సభ ముందు పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతుభరోసా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. రైతు భరోసా అర్హులకు మాత్రమే అందేట్లు చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విధి విధానాలపై సభలో చర్చ పెట్టాలని యోచిస్తోంది. అయితే ఈ సందర్భంగా రైతు బంధు ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసిన తీరు, అందులో చోటు చేసుకున్న అక్రమాలపై అసెంబ్లీ వేదికగా గట్టిగా ఎండగట్టేందుకు అధికార పార్టీ సిద్ధం అవుతోంది.
*సమావేశాలు వారం, పది రోజుల పాటు కొనసాగే అవకాశం :* వీటన్నింటినీ చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలు కనీసం వారం, పది రోజులు కొనసాగాల్సిన అవసరం ఉందని పలువురు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండటంతో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనాల్సి ఉండటంతో త్వరగా ఉభయ సభలు వాయిదా పడే అవకాశం ఉంది. శాసనసభలో మొదటి రోజైన ఇవాళ ఉభయ సభల ముందు ఆర్డినెన్స్‌లను పెట్టనున్నారు.
*5 బిల్లులు – 2 నివేదికలు :* జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్, పురపాలక సంఘాల ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆర్డినెన్స్, జీఎస్టీ ఆర్డినెన్స్, పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్‌లను సభ ముందు పెట్టనున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు, ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక.. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభ ముందు పెట్టనున్నారు.