లక్ష కేసులు పెట్టినా సరే… ఎగవేతల రెడ్డే అని పిలుస్తా..!

లక్ష కేసులు పెట్టినా సరే… ఎగవేతల రెడ్డే అని పిలుస్తా..!

– ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు అలాగే పిలుస్తా

– రెగ్యులరైజేషన్ కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది

– మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు

*సిద్దిపేట జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 12

ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు లక్ష కేసులు పెట్టినా ముఖ్యమంత్రి పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో గురువారం హరీశ్ రావు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పాడని.. అందుకే ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నారు. కెసిఆర్ ను అధికారం నుంచి దించడానికి ఒక గంట అదనంగా పని చేయాలని అధికారంలోకి వచ్చిన నెలలో సచివాలయంలో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరిస్తా అని చెప్పాడని తెలిపారు. అధికారం వచ్చి సంవత్సరం దాటిన సమస్య పరిష్కారానికి చూపలేదని ఆరోపించారు. మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడని విమర్శించారు. నాలుగు కోట్ల మంది ప్రజలను, మూడు కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశాడని ఆరోపించారు. బాండ్ పేపర్ల మీద రాసి హామీల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.15 వేలు రైతు భరోసా, రూ.4 వేల ఆసరా పెన్షన్, మహిళలకు రూ.2500లు ఇస్తామని.. అన్ని వర్గాలను మోసం మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా విద్యాహక్కు చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. వరంగల్లో ఏకశిలా పార్కు ముందు ధర్నా చేసిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు సంవత్సరం కిందట సెప్టెంబర్ 13 నాడు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేస్తున్నారని వాపోయారు. అసెంబ్లీ ముట్టడి చేస్తే అరెస్టు చేసి మహిళల అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఘనంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే అరెస్టు చేయడమే ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యే లోపే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని అంటే కేసు పెట్టారని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు ఇప్పటివరకు చనిపోయారు అని విమర్శించారు. విద్యార్థులకు పెట్టే అన్నం మెస్ బిల్లులను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15% విద్యకు బడ్జెట్ పెడతామని 7% బడ్జెట్ కూడా పెట్టలేదని తెలిపారు. విద్యా వాలంటీర్లను పూర్తిగా తొలగించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజలను ముంచి విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని తెలిపారు. ఒక గంట కాదు.. నాలుగు గంటలు అద నంగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఈనెల 16వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం అని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment