కనీస వేతనాల సలహా మండలి నియామకాన్ని పునః సమీక్షించాలి
సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి
గజ్వేల్ డిసెంబర్ 14 ప్రశ్న ఆయుధం :
రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా కనీస వేతనాల సలహా మండలిని నియమిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 21 ని పునః సమీక్షించాలని సిఐటియు సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి డిమాండ్ చేసినారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా కనీస వేతనాల సలహా మండలిని నియమిస్తూ ఆ జీవో లో ఐదుగురు కార్మిక సంఘాల తరఫున, ఐదుగురు యాజమాన్యాల తరఫున, ఇద్దరు స్వతంత్రుల తరపున మొత్తం పన్నెండు మంది అభ్యర్థులతో కమిటీ వేసిందని ఈ కమిటీలో ఐ ఎన్ టి యు సి ఏఐటియుసి కార్మిక సంఘాలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించి మిగతా కార్మిక సంఘాలను విస్మరించి కమిటీ వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.కేంద్ర కార్మిక సంఘం గా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను, కార్మికుల హక్కుల రక్షణ కోసం అనేక పోరాటాలను నిర్వహిస్తున్న సిఐటియు కార్మిక సంఘం నకు మరియు ఇతర కార్మిక సంఘాలకు కమిటి లో చోటు కల్పించకుండా కమిటీ వేయడాన్ని సిఐటియు తరఫున నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ రంగాలలో కనీస వేతనాల సవరణ చేయాలని అనేక సంవత్సరాలుగా సిఐటియు పోరాటం చేస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు దఫాలుగా కనీస వేతనాల సలహా మండలి నియామకంలో సిఐటియు కు ప్రాతినిధ్యం వుండేదని అన్నారు కనీస వేతనాల సమస్య పట్ల, కార్మికుల సంక్షేమం పట్ల గత ప్రభుత్వమైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఈ చర్యను బట్టి అర్థమవుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల పట్ల కార్మిక సంఘాల పట్ల వారి వైఖరిని మార్చుకొని సరిదిద్దుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.