అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడి, ప్రతిపక్షంలోకి రాగానే ప్రవచనాలు వల్లెవేస్తున్న వైసీపీ నేతలు గురివింద గింజ మాదిరే తమ కింద ఉన్న మచ్చను చూడలేకపోతున్నారు. సొంత పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టడం చేతకాని వారు సైతం రాష్ట్ర యోగక్షేమాల గురించి ఢిల్లీలో ధర్నాలు చేసారు ఎందుకో? మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? రాజకీయాలకు సరిపోతాడా? ఇటువంటి వారిని ఆదర్శముగా తీసుకుంటే సమాజం ఏమవుతుంది? ఇటువంటి వారికీ మహిళల పట్ల గౌరవం ఉంటుందా? అంటూ పవన్ వైపు వేలెత్తి చూపించిన జగన్ ఇప్పుడు తన పార్టీలో బయటపడుతున్న ఒక్కో నాయకుడి చీకటి చరిత్రకు ఎం సమాధానం చెపుతారు? మొన్న ఏడు పదుల వయస్సు కు చేరువవుతున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారం డిఎన్ఏ టెస్టులు దాక వెళ్ళింది. అయినా పార్టీ తరుపున విజయసాయి వ్యవహారాన్ని ఎవరు ఖండించే సాహసం చెయ్యలేదు కానీ రాష్ట్రంలో ‘శాంతి’ భద్రతలు అదుపు తప్పిపోయాయంటూ నానాయాగీ చేసారు. అయితే ఈ వ్యవహారం ఇంకా చల్లారాక ముందే ఇప్పుడు వైసీపీ లో మరో చీకటి కోణం బట్టబయలయ్యింది. ఆరు పదుల వయస్సుకు చేరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద “ఆయనకు ఇద్దరు” అంటూ సొంత కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఇటువంటి వారికా జగన్ పదవులిచ్చి సమాజం మీదకు వదిలింది అన్న సందేహం రాక మానదు. దువ్వాడ భార్య వాణి, వారి ఇద్దరి కుమార్తెలు దువ్వాడ ఈ వయస్సులో మరొకరితో అక్రమసంబంధం పెట్టుకుని సదరు మహిళతో సహజీవనం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ మీడియా ముందుకొచ్చారు. అయితే సాక్షికి మాత్రం ఇటువంటి వార్తలు కనపడవు, వినపడవు..ఎందుకో? అయితే అటు విజయసాయి విషయంలో స్పందించని జగన్ ఇప్పుడు దువ్వాడ విషయంలో జోక్యం చేసుకుంటారా? అయితే అప్పుడు విజయ సాయి విషయంలో కూడా ముందుగా ఆరోణలు ఎదుర్కుంటున్న మహిళ మీడియా ముందుకొచ్చి సంజాయిషీ ఇచ్చింది. ఇప్పుడు దువ్వాడ విషయంలో కూడా ముందుగా మీడియాకు వచ్చి సంజాయిషీ ఇచ్చింది ఆరోపణలు ఎదుర్కుంటున్న మహిళే కావడం విశేషం. అధికారంలో ఉన్నప్పుడు మహిళల పై రాజకీయం చేసిన వైసీపీ ఇప్పుడు మహిళతో రాజకీయం నడుపుతుంది..ఒక గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న సాయి గారి ‘శాంతి’ సందేశాలు, దువ్వాడ గారి ‘మాధుర్య’మైన చర్యలు, అంబటి గారి ‘సంజన, సుకన్య’ గీతాలు, మాధవ్ గారి ముచ్చట్లు….వైసీపీ విలువలకు అద్దం పడుతున్నాయి. మహిళల మీద ఈ స్థాయి గౌరవం ఉన్న నాయకులు ఒక్క వైసీపీ కి మాత్రమే అర్హులు అన్నంతగా వీరి చీకటి కోణాలు ఒక్కక్కకొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఈ వయస్సులో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ జగన్ ఇటువంటి నేతల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ కొసమెరుపు. తన పార్టీ నేతల కింద ఇన్ని మచ్చలు పెట్టుకుని జగన్ మాత్రం పక్కవారి పై బురద జల్లుతారు. గతంలో కూడా వైసీపీ మాజీ మంత్రుల మీద, ఆ పార్టీ నేతల మీద గంటా అరగంట అంటూ లీకైన ఆడియో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రభుత్వాన్ని నడుపుతున్న నేతల మీద ఇటువంటి అస్లీల ఆరోపణలు వచ్చినప్పటికీ, వైసీపీ ఎంపీల సోషల్ మీడియా భాగోతం గురించి పార్లమెంట్ వేదికగా చర్చ జరిగినప్పటికీ జగన్ వాటిని చూసి చూడకుండా, విని వినకుండా గమ్మునుండి పోయి పక్క పార్టీల నేతలకు మాత్రం హితబోధలు చేయడం ఆయన మాత్రమే చెయ్యగలరు. అంబటికి సొంత అల్లుడితో తగువా, ముద్రగడకు సొంత కూతురుతో రగడ, మరో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తారు, మరో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల మీదే గొడ్డలి వేటులు వేసిన కేసులో నిందితుడు, అసలు పార్టీ అధినేత జగన్ కే తల్లి, చెల్లితో విభేదాలు, 32 కేసులలో A 1 గా ఆరోపణలు ఎదుర్కొంటు పదేళ్ల నుంచి బెయిలు మీద తిరుగుతున్నారు. జోగి రమేష్ కర్రలు పట్టుకుని ఇంటి మీదకు దాడికి వెళ్లే చరిత్ర వెనకేసుకుంటే, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ మారణాయుధాలతో పార్టీ ఆఫీసులను విధ్వంసం చేసే చరిత్రను మూటకట్టుకున్నారు. ఇక పిన్నెల్లి వంటి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైనం కలలు ముందు సాక్ష్యాత్కరించింది. కొడాలి నాని, పేర్నినాని, రోజా బూతుల సంస్కృతిని పెంచి పోషించారు. ఇక ద్వారంపూడి, పెద్ది రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి నేతలు కంటికి కనిపించిందల్లా నాకే సొంతం అంటూ ప్రకృతిని నాశనము చేసారు. అలాగే సజ్జల భార్గవ్ రెడ్డి, వర్ర రవీంద్ర రెడ్డి వంటి వైసీపీ కాలకేయులు సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఇంతమంది విధ్వంసకారులను రాజకీయాలలో పెంచి పోషించిన ఘనత ఒక్క వైసీపీ పార్టీకి ఆ పార్టీ అధినేత ఒక్క జగన్ కు మాత్రమే చెల్లుతుంది అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇలా వైసీపీలో ఉన్న ఒక్కో నేత వెనుక ఒక్కో చీకటి చరిత్ర దాగి ఉంది. అయితే ఇందులో శిశిపాలుడి మాదిరి వారి పాపాల చిట్టా పూర్తైన వారందరి భాగోతం ఒకొక్కటిగా బయటకు వస్తుంది. అందులో నిన్న విజయ సాయి వంతు వస్తే, నేడు దువ్వాడ టైం వచ్చింది. మరి రేపు ఎవరి పాపం పండుతుందో ఎవరి గుట్టు బయటపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి..