ఆనాడు కలకల..! ఈనాడు వెలవెల..!
* పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయని బిఆర్ఎస్..!
* ఔత్సాహికులు ఉన్నా మీన మేషాలు లెక్కిస్తున్న అధిష్టానం..!
*గజ్వేల్ ఫిబ్రవరి 6
ఎమ్మెల్సీ సీటు కోసం ఆనాడు బిఆర్ఎస్ లో విపరీతమైన పోటీ.. ఎవరికి వారే పోటా పోటీగా ప్రయత్నాలు.. మరికొందరు సిఫారసు లేఖలతో ప్రయత్నం.. ఖర్చు ఎంతైనా వెనక్కి తగ్గని నేతలు.. టికెట్ దక్కితే గెలిచినంతగా ఎగిరి గంతేసే నాయకులు.. బారాబర్ గెలుస్తామన్న ధీమాతో వ్యవహరించిన నేతలు.. ఈ ప్రస్థానం బిఆర్ఎస్ కు కాలం అనుకూలంగా ఉన్న గతంలో.. సీన్ కట్ చేస్తే.. ఈనాడు నేతల్లో నిస్తేజం.. నాయకుల్లో నిర్లిప్తత.. పోటీ చేసేందుకు ఉత్సాహం కరువు.. ఆశావహుల్లో గెలుస్తామో లేదో అని సందేహం.. పార్టీ కార్యాలయంలో కనపడని నేతలు, కార్యకర్తల సందోహం.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టాభద్రుల ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నికల నామినేషన్లు ప్రారంభం అయ్యాయి.. తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు బిఆర్ఎస్ అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఫిబ్రవరి 3న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినా కూడా అభ్యర్థిని ప్రకటిస్తారో.. లేదా ఎవరికైనా సపోర్ట్ చేస్తారో చెప్పని దీనస్థితి బిఆర్ఎస్ లో కనిపిస్తుంది. అధికారం పోతే ఎవరి పరిస్థితి అయినా ఎంత దుర్భరంగా ఉంటుందో కండ్లకు కట్టినట్టు చెప్పే వాస్తవం ఇదని, ఎవరైనా ఇది నమ్మాల్సిందేనని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవకపోవడంతో బిఆర్ఎస్ ఒకింత ఆత్మ రక్షణలో పడిందని విశ్లేషకులు అంచనాకు వచ్చారు. ఒకవేళ ఎమ్మెల్సీ సీటు ఓడిపోతే స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందని ఆ పార్టీ ఉద్దేశం కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అభ్యర్థి ఓడినా.. గెలిచినా అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని కొన్ని బిఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితిలో బిఆర్ఎస్ ఉందని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఇప్పటికే దెప్పి పొడుస్తున్నాయి. ఆయా పార్టీలకు చెంపపెట్టులా అభ్యర్థిని ప్రకటించి క్యాడర్లో ఉత్సాహం నింపాలని పార్టీ క్యాడర్ అధిష్టానానికి మొరపెట్టుకున్నా.. అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేదని పలువురు పార్టీ ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అరడజను మంది నేతలు నామినేషన్ వేసేందుకు రెడీగా ఉన్నారని, బిఆర్ఎస్ అధిష్టానం ఆదేశించడమే తరువాయి అన్నట్లు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదనే అపవాదును రాజకీయ పార్టీగా పట్టభద్రుల్లో బిఆర్ఎస్ మూటగట్టుకుంది. ఈ విషయం కూడా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తెలిసిందేనని, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెడితే పట్టబద్రులు బిఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో ఉండరని, వారికి నమ్మకం కలిగించడం బిఆర్ఎస్ కు కత్తి మీద స్వాముల మారే అవకాశం ఉందని, అన్ని ఆలోచించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిని నిలపకపోవచ్చని మరో వాదన బిఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసేలోపు తమ అభ్యర్థిని బిఆర్ఎస్ ప్రకటిస్తుందో లేదో.. లేక ఎవరైనా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తుందో.. అన్న ఆసక్తి బిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం క్యాడర్లో ఉత్సాహం నింపుతుందా.. నీళ్లు చల్లినట్లు చేస్తుందా అని పలువురు బిఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయం ఎవరికి అంతుచిక్కని వైనంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మరో రెండు రోజులు ఎదురు చూద్దాం.