*రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఇదే నా సవాల్.. సిద్ధమా?: కేంద్ర మంత్రి బండి సంజయ్..*
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ కలిసే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పలు కేసుల్లో కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతుందే రేవంత్ రెడ్డి అని అన్నారు. వారిద్దరూ మంచి దోస్తులని, అందుకే చెన్నై డీలిమిటేషన్ మీటింగ్‌కు కలిసే వెళ్లారని చెప్పుకొచ్చారు. త్వరలో డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జరగబోయే మీటింగ్‌ను సైతం ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.
అలాగే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంట్‌లో ఓటు వేయించారని మండిపడ్డారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్‌ను కాపాడేందుకే కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించలేదని ఆరోపణలు గుప్పించారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ధి మాత్రం మారలేదని ఆగ్రహించారు. ఇద్దరూ ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
కాపాడేది రేవంత్ రెడ్డే..
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..”తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అపవిత్ర పొత్తు కొనసాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాణ మిత్రులుగా మారిపోయారు. అందుకే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల కేసులను ముఖ్యమంత్రి నీరుగారుస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అరెస్ట్ కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అడ్డుపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ధరణి భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్, ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు వంటి వాటిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని సాక్షాత్తు రేవంత్ రెడ్డే మొదట్లో చెప్పారు. కానీ, కేటీఆర్‌తో కుమ్మక్కై ఆ కేసులను నీరుగార్చేందుకు సీఎం ప్రయత్నిస్తుండటం సిగ్గు చేటు. అందుకు ప్రతిఫలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి భూముల దోపిడీ, అవినీతికి కేటీఆర్ సహకరిస్తున్నారు.
కేటీఆర్.. డ్రామాలు ఆపు..!
ఆరు గ్యారంటీలతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో, బయట నిలదీయకుండా ఉత్తుత్తి డ్రామాలు ఆడుతున్నారు కేటీఆర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములను తెగనమ్మడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే.. పైకి గొడవ చేసినట్లు నటిస్తున్నా లోలోపల ఆయనకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, అంతకుముందు జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు చిత్తుగా ఓడించినా వారిలో మార్పు రాకపోగా బీజేపీని దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేస్తుంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసే బీజేపీపై బురదచల్లేందుకు కుట్రలు చేస్తున్నారు.
విచారణకు సిద్ధమా?
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలి. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలన కాదు. నీతి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనమైన ప్రధాని నరేంద్రమోదీ సర్కార్. అవినీతిపరులు, భూ దోపిడీదారులపై ఉక్కుపాదం మోపే మోదీ పాలన కొనసాగుతోంది. సీబీఐ విచారణకు సిద్ధపడితే హెచ్‌సీయూ భూములను దోచుకునేందుకు ఎవరు కుట్రలు చేస్తున్నారో, వారికి ఎవరు సహకరిస్తున్నారనే విషయాలన్నీ బయటకు వస్తాయి. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సీబీఐ విచారణ కోరే దమ్ముందా?” అంటూ సవాల్ చేశారు..