ఓటమి తాత్కాలిక అనుభవం: కె శ్రీనివాసాచారి – సామాజిక కార్యకర్త, సైకాలజీ కౌన్సిలర్
“ఓటమిని తట్టుకోవడమే నిజమైన గెలుపని, ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమంది విద్యార్థులకు ఆనందాన్ని మరికొందరికి విషాదాన్ని కలిగించటం సహజమని” సామాజిక కార్యకర్త, సైకాలజీ కౌన్సిలర్ కె. శ్రీనివాసాచారి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ – మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 66.89 గా, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతా శాతం 71.37 గానూ ఉందన్నారు. పాసైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూనే ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మస్థైర్యంతో, ధైర్యంగా ఉండాలని కోరారు. చదువులోనూ, జీవితంలోనూ అనేక అపజయాలు సహజమని, కానీ అవి తాత్కాలికమని గుర్తించాలన్నారు. ఏ మనిషి సంపూర్ణ వ్యక్తి కాదని బలాలతోపాటు అనేక బలహీనతలు ఉంటాయని, బలహీనతలను తగ్గించుకుంటూ, బలాలు పెంచుకున్నప్పుడే మనుషులు మహాత్ములవుతారని సూచించారు. సమాజంలో మన ముందు విజేతలుగా ఉన్న చాలామంది తొలినాళ్లలో ఇలాంటి అనేక ఒడిదుడుకులు, ఓటముల బారిన పడిన వారేనని గుర్తు చేశారు. ఉత్తీర్ణత కాని వారిని గెలిచేయడం, సూటి పోటి మాటలాడడం తగదని, తల్లిదండ్రులు, టీచర్లు, తోటివారు, సమాజం వారికి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఉత్తీర్ణత కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయని వాటిని గుర్తించి, విశ్లేషించుకోవడం విజేతల లక్షణమని, అతిగా ఆందోళన పడుతూ డిప్రెషన్ లోకి వెళ్లడం మానేయాలన్నారు. కేవలం ఫలితాలు మాత్రమే ముఖ్యం కాదని, మనం సంపాదించిన విజ్ఞానం ఎప్పటికీ నిలిచే ఉంటుందని, వివేకాన్ని పెంచుకోవడమే విద్య యొక్క సారాంశమని స్పష్టం చేశారు. ఉత్తీర్ణత కానీ పిల్లల యెడల ప్రతి ఒక్కరూ సున్నితంగా వ్యవహరించాలని, ఒక కంట కొంతకాలం వారిని కనిపెట్టుకొని ఉండాలని శ్రీనివాసాచారి సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఏదైనా, అసహజమైన మార్పులు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్లను, విద్యావేత్తలను, సైకాలజీ నిపుణులు కలిసి వృత్తిపరమైన సహాయం పొందాలని సూచించారు.