విద్యుత్ ఘాతంతో వరి కోత మిషన్ దగ్ధం

*విద్యుత్ ఘాతంతో వరి కోత మిషన్ దగ్ధం*

*తుంగతుర్తి:* విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమో…లేక ఆలసత్వమో…? కానీ ఓవైపు రైతాంగం మరోవైపు ప్రజానీకం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా బతకాల్సొచ్చిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలను సరిచేయాలంటూ గత కొంతకాలంగా ఆ శాఖ అధికారులు,సిబ్బందిని స్వయంగా సంబదీకులు కలిసి చెప్పుకున్నప్పటికీ “ఆ చెవి ద్వారా విని ఈ చెవి నుండి వదిలేసినట్లుగా” పరిస్థితి మారింది.చివరికి వీరి నిర్లక్ష్యంతో పొలాల్లో వరి కోత మిషన్ విద్యుత్ తీగలకు తగిలి తగలబడిపోగా డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో నెలకొన్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీ గృహాల మీదుగా హై ఓల్టేజి విద్యుత్ వైర్లు వెళ్లాయి.ఫలితంగా గతంలో ప్రమాదవశాత్తు ఇండ్లు కూడా దగ్ధమయ్యాయి.అయితే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లగా పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.కానీ అక్కడి పరిస్థితి ఎప్పటిలాగే ఉంది.ఇక వ్యవసాయ భూముల్లో కూడా విద్యుత్ వైర్లన్నీ కిందికి వేలాడుతూ చేయి ఎత్తితే తగిలే విధంగా భయంకరంగా మారాయి.దీంతో రైతులు తమ భూముల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు.అయితే రెండు రోజుల క్రితం రచ్చ సోమయ్యకు చెందిన భూమిలో వరి కోస్తుండగా కిందికి వేలాడుతున్న వైర్లకు అకస్మాత్తుగా వరి కోత యంత్రం తగిలి దగ్ధమైంది.ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా ప్రాణాల నుండి తప్పించుకోగలిగారు.ఇలా పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్ల సంగతి కేవలం సోమయ్యదే కాదు.చాలామంది రైతుల పొలాల్లో ఇలాంటివి కనిపిస్తాయి.అధికారులు ఇప్పటికైనా స్పందించి పరిష్కరించాలని వారంతా కోరుతున్నాను.

Join WhatsApp

Join Now