*_Modi government decision: దేశవ్యాప్తంగా కులగణన..!!_*
*_తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..!!_*
కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి.. అవి అసమగ్రం
ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు
ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం
దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం
కులగణనకు కాంగ్రెస్ తొలినుంచీ వ్యతిరేకం
మేం జరిపే జన, కులగణనతో దేశం పటిష్ఠం
ఏ వర్గాన్నీ నొప్పించకుండా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను మేం తీసుకొచ్చాం
కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్
సెప్టెంబరు నుంచి జన, కులగణన ప్రారంభం?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో.. మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమా వేశంలో.. జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన జరిపిన కాంగ్రె్‌సను రాజకీయంగా తిప్పికొట్టేందుకు మోదీ ఆధ్వర్యంలోని క్యాబినెట్ కమిటీ(సీసీపీఏ) తీసుకున్న ఈ నిర్ణయం ‘మాస్టర్ స్ట్రోక్’ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. బీజేపీ మాత్రం.. దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించగా.. కాంగ్రెస్ అగ్రనేతలు తమ డిమాండ్ నెరవేరిందని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ఏకంగా మోదీ సర్కారు ‘ఆకస్మిక నిర్ణయం’ అని పేర్కొంటూ.. కులగణనను స్వాగతించారు. వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆరోపించాయి. బీజేపీ మిత్రపక్షాలు మోదీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో ‘సమ్మిళిత వృద్ధి’ వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో జన, కులగణనను ప్రారంభించి.. రెండేళ్లలో ముగించనున్నట్లు తెలిసింది. బుధవారం నాటి క్యాబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలను వెల్లడిస్తూ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు నిర్వహించిన కుల సర్వేలు పారదర్శకంగా జరగలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ గణనను పూర్తిచేశారని ఆరోపించారు. తాము జాతీయ స్థాయిలో నిర్వహించబోయే జనాభా లెక్కలతోపాటే కులగణనను పూర్తిచేస్తామని చెప్పారు. ”నిజానికి కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకం.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చేపట్టిన జనాభా లెక్కల్లో కులగణనను చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కుల గణనపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆమేరకు లోక్‌సభకు హామీ ఇచ్చారు. కానీ, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి.. కులగణనకు బదులు సామాజిక ఆర్థిక సర్వే(ఎ్‌సఈసీసీ)-2011ను నిర్వహించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కులగణనను వాడుకుంటున్నాయి” అని ఆయ న ఆరోపించారు. జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ”భారత రాజ్యాంగంలోని 246వ అధికరణ కింద.. ఏడో షెడ్యూల్‌లో 69వ జాబితాలో జనాభా లెక్కల ప్రస్తావన ఉంది. జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగం స్పష్టం చేస్తోం ది. కొన్ని రాష్ట్రాలు కులాలపై సర్వేలు చేశాయి. కానీ, ఒకట్రెండు రాష్ట్రాలే సమగ్రంగా సర్వేలను నిర్వహించాయి. మిగతా రాష్ట్రాలు నిర్వహించిన సర్వేల్లో పారదర్శకత లేదు. కేవలం రాజకీయ దృక్కోణంతోనే నిర్వహించాయి. ఇలాంటి అసమగ్ర సర్వేలు సమాజంలో సందేహాలను కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల వల్ల మన సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకు కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది” అన్నారు. ఉత్తుత్తి సర్వేలు జరపడం తమ లక్ష్యం కాదని తెలిపారు. తాము జరిపే జనగణన, కులగణనతో దేశ సామాజిక, ఆర్థిక నిర్మాణం పటిష్ఠం అవుతుందని, దేశం అభివృద్ధి పథంలోకి పయనిస్తుందన్నారు. దేశ, సమాజ ప్రయోజనాలకు, విలువలకు మోదీ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో ఈ నిర్ణయంతో స్పష్టమవుతుందన్నారు.
*_పాదర్శకంగా నిధులను కేటాయించాలి: ఖర్గే_*
కేంద్రం కులగణన కోసం పారదర్శకంగా నిధులను కేటాయించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. తాము ముందు నుంచి జాతీయ స్థాయిలో కులగణనకు డిమాండ్లు చేస్తున్నామని, నిధుల కేటాయింపు జరిగితే కులగణన ప్రారంభమవుతుందన్నారు. ఇంతకాలం మోదీ సర్కారు కులగణన పేరెత్తితే.. విపక్షాలు సమాజాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించిందన్నారు.
*_ఆలస్యమైనా మంచి నిర్ణయం: జైరాంరమేశ్_*
కులగణనపై మోదీ సర్కారు ఆలస్యంగా స్పందించినా.. ఇది మంచి నిర్ణయమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ అన్నారు. ”అసలు కులగణన జరపకపోవడం కంటే.. ఆలస్యమైనా ఆమోదయోగ్యమే” అన్నారు. 2023 ఏప్రిల్ 16న కులగణన కోసం ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖను, గత నెల 9న అహ్మదాబాద్ సమావేశంలో కులగణనపై చేసిన తీర్మానం ప్రతులను ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కాగా మోదీ సర్కారు కులగణనపై చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుందని కమ్యూనిస్టు పార్టీలు అభిప్రాయపడ్డాయి. కులగణనపై మోదీ మాటమార్చారని సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఆరోపించారు. ”కులగణన ప్రస్తావన వస్తే పేదలు, యువకులు, మహిళలు, రైతులు అనే నాలుగు కులాలే సమాజంలో ఉన్నాయని అని మోదీ అనేవారు. ఇప్పుడు మాటమార్చి కులగణనకు సిద్ధమయ్యారు” అని అన్నారు. కులగణన ఎప్పటిలోగా పూర్తవుతుందో కేంద్రం చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి డిమాండ్ చేశారు. కులగణనపై చాలా ఆలస్యంగానైనా.. నిర్ణయం తీసుకున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య అన్నారు.
*_దేశాభివృద్ధికి దోహదం: నితీశ్‌కుమార్_*
దేశవ్యాప్త కులగణన తమ పార్టీ(జేడీయూ) పాత డిమాండ్ అని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ అన్నారు. కేంద్రం నిర్ణయం అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ.. దేశాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. మొట్టమొదటగా తాము బిహార్‌లో కులగణన జరిపామని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ అన్నారు. దీన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ కులగణనకు తమనుతామే ఆద్యులుగా చెప్పుకొంటోందన్నారు.
*_కాంగ్రెస్ చేయనిది మేం చేస్తున్నాం: షా_*
దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని కులగణనను తాము చేపడుతున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో పోస్టు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేపట్టని కాంగ్రెస్..ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలతో మాట్లాడుతోందన్నారు.
*_బిహార్ ఎన్నికలకోసమే కులగణనప్రకటన: స్టాలిన్_*
కులగణనను తిరస్కరించేందుకు, జాప్యం చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనతోపాటు కులగణనను చేపడతామని ప్రకటించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ‘జనగణన ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది?’ అని బుధవారం ఆయన ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల్లో సామాజిక న్యాయం కీలకం కాబట్టి, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే కేంద్రం ఈ ఆకస్మిక చర్యకు ఉపక్రమించిందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్ని కులం ఆధారంగా విభజిస్తున్నాయని విమర్శించిన ప్రధాని.. ఇప్పుడు అదే డిమాండ్‌కు తలొగ్గారని చెప్పారు. కులగణన తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే సాధించిన విజయమన్నారు.
*_ఆ మూడు రాష్ట్రాలే ఆదర్శం!_*
దేశంలో కులగణనకు బిహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచాయని చెప్పవచ్చు. నిజానికి భారత్‌లో బ్రిటిష్ హయాంలో 1931లో చివరిసారిగా జనాభా లెక్కలతో పాటు.. కులగణనను నిర్వహించారు. స్వాతంత్య్రం తర్వాత.. 1951 నిర్వహించిన జనగణనలో.. కులగణనను తొలగించారు. దాంతో.. 1931లో నమోదైన ఓబీసీల లెక్క మేరకు ఆ కేటగిరీకి 27ు రిజర్వేషన్లను కొనసాగిస్తున్నారు. 2011లో కులగణనను నిర్వహించాలని నిర్ణయించినా.. సామాజిక ఆర్థిక సర్వే(ఎ్‌సఈసీసీ)ను చేపట్టారు. ఆ డాటాను ఇప్పటికీ విడుదల చేయలేదు. అయితే.. సామాజిక న్యాయం కోసం కులగణన జరిగి తీరాల్సిందేననే డిమాండ్లు ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. బిహార్ ప్రభుత్వం మాత్రం 2023లో కులగణను చేసి, చూపించింది. న్యాయపరమైన అవాంతరాలెదురైనా.. బాలారిష్టాలను దాటుకుని, ముందుకు సాగింది. 13 కోట్ల బిహార్ జనాభాలో(2011 జనాభా లెక్కల ప్రకారం 10.41 కోట్లు) 63.14ు ఓబీసీలు ఉన్నట్లు తేల్చింది. దాంతో.. 63ు ఉన్న జనాభాకు 27ు కోటా న్యాయమేనా? అనే చర్చ మొదలైంది. బిహార్‌లో ఆర్థికంగా మరీ వెనకబడిన కులాలు మొత్తం జనాభాలో 36.01 శాతంగా ఉండడంతో.. కోటా పెంపు డిమాం డ్ మొదలైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని ఎన్నికల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. కర్ణాటకలోనూ ఇచ్చిన హామీ మేరకు కులగణనను జరిపింది. నిజానికి కర్ణాటకలో 2015లోనే కులగణన మొదలై.. 2018 నాటికి సర్వే పూర్తయినా 2024లో బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకావ్ హెగ్డే ప్రభుత్వానికి నివేదికను ఇచ్చారు. దీని ప్రకారం కర్ణాటకలో ఈబీసీల వాటా 69.6ు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ కులగణన హామీని నెరవేర్చింది. 50 రోజులపాటు 1.03 లక్షల మంది ఎన్యుమరేటర్లు కులగణనను నిర్వహించగా.. 96.9ు కుటుంబాలు వివరాలను వెల్లడించాయి. మొత్తం 3.54 కోట్ల మందిని సర్వే చేయగా.. బీసీల వాటా 46.25శాతంగా తేలింది. ముస్లిం మైనారిటీల్లో బీసీలను కలుపుకొంటే ఈబీసీల వాటా 56.33శాతం ఉంది. ఈ డాటాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లను కల్పిస్తూ 2బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లులను కేంద్రానికి పంపి, వీటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరింది.
*_50% కోటా ఎత్తివేతకు మార్గం: రాహుల్_*
మోదీ సర్కారు కులగణనపై తీసుకున్న ‘అకస్మాత్’ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. 11 ఏళ్లుగా ఈ అంశాన్ని విస్మరించి, ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని, అయినా.. కాలపరిమితిని చెప్పలేదని విలేకరులతో అన్నారు. ”ఇది ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిన అంశమే. ఇంతకాలం 50ు రిజర్వేషన్ కోటా నిబంధనలో ఉన్నాం. కులగణన జరిగితే.. ఆ పరిమితిని దాటడానికి మార్గం సుగమమవుతుంది. ఆ పరిమితిని ఎత్తివేసేదాకా మేం పోరాడుతాం. మేము కోరుకునేది జనాల కులగణన మాత్రమే. బ్యూరోక్రాట్ల కులగణన కాదు” అని వ్యాఖ్యానించారు. తమ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణనకు సన్నద్ధమైందని పేర్కొన్నారు.
*_సమ్మిళిత వృద్ధిపై నిబద్ధత: చంద్రబాబు_*
దేశంలో సమ్మిళిత వృద్ధిపై ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనం కులగణన నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, దీని వల్ల సమాజంలో అణగారిన వర్గాలకు మేలు జరిగే విధానాల రూపకల్పన సుసాధ్యమవుతుందన్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికా్‌సతో దేశంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఎక్స్‌లో పోస్టు చేశారు.