టెక్నాలజీతో విద్యాబోధనను మెరుగుపరచాలి: ఉపాధ్యాయులకు కలెక్టర్ గౌతం సూచన

*టెక్నాలజీతో విద్యాబోధనను మెరుగుపరచాలి: ఉపాధ్యాయులకు కలెక్టర్ గౌతం సూచన*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 16

నాచారం, మే 16: ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యాబోధన సామర్థ్యాలను పెంపొందించడానికి వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అన్నారు.

శుక్రవారం నాచారం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరుగుతున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు టెక్నాలజీని అందిపుచ్చుకుని బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ ఒకేలా నేర్చుకోలేరని, వారి అవసరాలను గుర్తించి బోధించడమే ఉపాధ్యాయుల ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.

అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపాధ్యాయులు తప్పనిసరిగా నేర్చుకోవాలని, దానిని తరగతి గదిలో సమర్థవంతంగా ఉపయోగించాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. జీపీటీ వంటి ఆధునిక యాప్‌లను వినియోగించడం ద్వారా విద్యారంగంలో మరింత మెరుగుదల సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీపై పట్టు సాధించడం ద్వారా వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చని ఆయన తెలిపారు.

పిల్లలు టెక్నాలజీ విషయంలో ఉపాధ్యాయుల కంటే ముందున్నారని గుర్తు చేస్తూ, ఈ శిక్షణ ద్వారా ప్యానెల్‌ను ఎలా ఉపయోగించాలి, కంటెంట్‌ను స్పష్టంగా ఎలా తెలియజేయాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు అందించడం అందరి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలతో పాటు విద్యార్థుల పఠన స్థాయిని పెంచడానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ శిక్షణ కార్యక్రమంపై ఉపాధ్యాయులు తమ అనుభవాలు, ఆలోచనలు, సలహాలు, సూచనలు తప్పనిసరిగా ఫీడ్‌బ్యాక్ రూపంలో తెలియజేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో ముచ్చటించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి, ఉప్పల్ తహసీల్దారు వాణి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now