*తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 17( ప్రశ్న ఆయుధం న్యూస్)
ఉగ్రవాదులను తుద ముట్టించిన భారతదేశ సైనికుల పోరాటం ఎనలేనిదని ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు తిరంగా ర్యాలీని నిర్వహించారు. సాయిబాబా టెంపుల్ నుండి రావాడ జంక్షన్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ *తోయక జగదీశ్వరి* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగ్రవాదులు భారతదేశంపై కన్నెత్తి చూడకుండా రక్షణ దళాలు పోరాడాయని అన్నారు. భారతదేశంపై దాడులు జరిగితే ఎటువంటి బుద్ధి చెప్పాలో భారత్ సైనికులు ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం గర్వంగా ఉందన్నారు. మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ చెప్పిందని, భారత్ పై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో రక్షణ దళాల పోరాటానికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఈ తిరంగా ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరు చేతిలో జాతీయ జెండా పట్టుకుని వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, పార్లమెంట్, నియోజవర్గ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, యువత, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.