**అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి జాప్యం ఉండకూడదు – కలెక్టర్ గౌతం ఆదేశాలు**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 19
అల్వాల్లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రి పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సంబంధిత కాంట్రాక్టర్లు మరియు అధికారులను ఆదేశించారు.సోమవారం టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన నిర్మాణ పనుల పురోగతి సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కాంట్రాక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణం మరో రెండు నెలల్లో ముగుస్తుందని తెలిపారు. రీ-డిజైన్ కారణంగా అదనపు నిధులు అవసరమవుతున్నాయని కూడా కలెక్టర్కు వివరించారు.
అటవీ శాఖ, ఏఏఐ, పర్యావరణ శాఖ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి అవసరమైన ఎన్ఓసీలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్, నీటి కనెక్షన్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
ఆసుపత్రిలో టీచింగ్ ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఫర్నిచర్, ఆధునిక వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్ల కోసం ఒప్పందాలు పూర్తయ్యాయని తెలిపారు.
కొన్ని అంశాలకు సంబంధించిన డీఎంఏ అనుమతులపై తాను స్వయంగా సంబంధిత అధికారులతో చర్చిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 2025 నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ వనజ, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఎంఅండ్ హెచ్ఓ ఉమాగౌరీ, అల్వాల్ తహసీల్దారు రాములు, కాంట్రాక్టర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.