ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు… 10 మంది మృతి

ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు… 10 మంది మృతి

గ్రాజ్ నగరంలోని ఓ పాఠశాలలో కాల్పుల ఘటన

10 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

నిందితుడైన విద్యార్థి స్కూల్ టాయిలెట్‌లో కాల్చుకుని ఆత్మహత్య

మృతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నట్లు ఓఆర్ఎఫ్ కథనం

ఆస్ట్రియాలోని రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి బోర్గ్ డ్రెయిర్‌షుట్జెన్‌గాస్సే పాఠశాలలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. అనంతరం నిందితుడైన విద్యార్థి పాఠశాల టాయిలెట్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పాఠశాల భవనం లోపలి నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందింది. ఆస్ట్రియా ప్రభుత్వ ప్రసార సంస్థ ఓఆర్ఎఫ్ కథనం ప్రకారం, ఈ కాల్పుల్లో కనీసం 10 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మరణించిన వారిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. కాల్పులు జరిపిన విద్యార్థి కూడా మరణించిన వారిలో ఉన్నాడని గ్రాజ్ నగర మేయర్ ఎల్కే ఖర్ వెల్లడించారు.

“డ్రెయిర్‌షుట్జెన్‌గాస్సేలోని ఫెడరల్ అప్పర్ సెకండరీ పాఠశాలలో ఈ కాల్పులు జరిగాయని” ఆస్ట్రియా పోలీసులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం, పాఠశాలను పూర్తిగా ఖాళీ చేయించి, విద్యార్థులు, సిబ్బంది అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు ఎక్స్ ద్వారా తెలిపారు. గాయపడిన విద్యార్థులకు పాఠశాలకు సమీపంలోని హెల్మట్ లిస్ట్ హాల్ అనే ఈవెంట్స్ వేదిక వద్ద వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గ్రాజ్ నగరం ఆస్ట్రియాలో ఆగ్నేయ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సుమారు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.

Join WhatsApp

Join Now