పాలేరు సాగర్ యూటీ పనులు పూర్తి – రేపు సాగునీటి విడుదల

పాలేరు సాగర్ యూటీ పనులు పూర్తి – సాగునీటి విడుదల

ఖమ్మం: పాలేరు నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువ అండర్ టన్నెల్ (యూటీ) నిర్మాణం తక్షణ ప్రాధాన్యంతో పూర్తి అయింది. రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి 1500 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు.రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపాడు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని

చెప్పాడు.ఆదివారం కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో ఈ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు.

గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల సెప్టెంబర్‌లో పాలేరు రిజర్వాయర్ దగ్గర ప్రధాన కాలువపై ఉన్న యూటీ పూర్తిగా దెబ్బతింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులతో సాగునీటి సరఫరా కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో శాశ్వతంగా యూటీ మరమ్మతులు చేపట్టారు.

సుమారు రూ.14.20 కోట్ల వ్యయంతో పనులు పూర్తయ్యాయి. ఈ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందుతుంది. పాలేరు నియోజకవర్గం ఒక్కటిలోనే 1.33 లక్షల ఎకరాలకు నీరు చేరుతుంది.వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రోజు రెండు షిఫ్టులుగా పనులు కొనసాగించి గడువులోగా పూర్తిచేసినట్లు మంత్రి చెప్పారు.

Join WhatsApp

Join Now