వరి అన్నం తింటే షుగర్ వస్తుందా..?

*వరి అన్నం తింటే షుగర్ వస్తుందా? – ఏ ఏ బియ్యం లో ఎంత ఎంత GI ఉందొ… అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!*

అన్నం తినాలంటే భయపడుతున్నారా? – ఆరోగ్యానికి ఏ రైస్ బెస్ట్?

అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని పెద్దలు చెబుతుంటారు. భారతీయ ఆహారపు అలవాట్లలో ఇది ముఖ్యమైనది. చాలామందికి వేడి వేడి అన్నంలో కాస్త ఆవకాయ, నెయ్యి కలిపి తినందే ముద్ద కూడా దిగదు. కొంతమందికి పొగలుగక్కే పులావును చికెన్ కర్రీతో లాగిస్తుంటారు. కానీ, చాలామందికి ఒకటే దిగులు. అన్నం ఎక్కువగా తీసుకుంటే ఏవైన అనారోగ్య సమస్యలు వస్తాయో అని సందేహంలో ఉంటారు. ఈ క్రమంలో ఇది ఆరోగ్యానికి మంచిదో, కాదో ఈ స్టోరీలో తెలుసుకుందాం!

అన్నం ఎక్కువగా తింటే షుగర్ వస్తుందనో, అప్పటికే ఉన్న వాళ్లకు ఇంకా పెరుగుతుందనో భయంతో చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కానీ వరి అన్నం విషయంలో మరీ అంత భయం అవసరం లేదని పేర్కొన్నారు. తినడంలో కొన్ని పద్ధతులు, జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు.

ప్రపంచంలో 50 శాతం పైగా ప్రజల ప్రధాన ఆహారం బియ్యమే. మూడు పూటలా అన్నాన్ని తింటూ శారీరక శ్రమ చేస్తూ దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నవారు చాలామంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. కానీ, వరి అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న అనే నమ్మకం విస్తృతమవడంతో చాలామంది క్రమంగా దీన్ని తగ్గించేస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు బియ్యం ఎక్కువగా తినే వ్యక్తులు, తక్కువ మొత్తంలో బియ్యం తినే వ్యక్తుల కంటే మధుమేహం వచ్చే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని Harvard School of Public Health అధ్యయనంలో పేర్కొంది.

కారణాలు వేరే : రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి వరి అన్నం తినడం మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో శారీరక శ్రమ తగ్గిపోవటం, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ వల్ల పరిస్థితి గాడి తప్పిందని పేర్కొన్నారు. అంతేకాకుండా జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు దుష్ప్రభావం చూపుతున్నాయని వివరించారు. సకాలంలో తినకపోవడం, రాత్రి మరీ ఆలస్యంగా తినటం, వేగంగా తినటం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తాయని తెలిపారు. దీనితో పాటు రోజంతా కూర్చుని పనిచేయడం, శారీరకంగా చురుకుగా ఉండకపోవడం, అధిక బరువు ఉండటం డయాబెటీస్ కారణాలని medlineplus అధ్యయనంలో వెల్లడించింది.

ఇలా మేలు : అన్నాన్ని పూర్తిగా మానేయడం కంటే, దాన్ని సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటి వాటిని ఎంచుకోవచ్చని, అన్నంతో పాటు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, పనీర్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. తెల్ల బియ్యం తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, బ్రౌన్ రైస్ తినడం వల్ల తక్కువ ప్రమాదం ఉంటుందని Harvard Health Publishing అధ్యయనంలో పేర్కొంది.

గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే సూచిక అని నిపుణులు చెబుతున్నారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయని, ఈ సూచిక 0 నుంచి 100 వరకు మోతాదును కలిగి ఉంటుందని medlineplus అధ్యయనంలో పేర్కొంది. బియ్యం రకం, ధాన్యం నుంచి బియ్యం మిల్లు ఆడే పద్ధతిని అనుసరించి గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతుందని, ముడిబియ్యం కంటే తెల్లబియ్యంలో ఎక్కువ జీఐ కలిగి ఉంటుందని పేర్కొన్నారు. దేశవాళీ బియ్యం, ఎర్రబియ్యంలో అధిక పీచు, పోషకాల కారణంగా తక్కువ జీఐ విలువ ఉంటుందని, మనం ఎక్కువగా వాడే మసూరి రకంలో తక్కువ నుంచి మధ్యస్థ జీఐ ఉంటుందన్నారు.

గ్లైసెమిక్ ఇండెక్స్ కీలకం :

Low Level GI : గోధుమ రొట్టె, పచ్చ అరటి, బెండకాయ, పప్పులు

Medium level GI : బ్రౌన్​రైస్, ఓట్స్, పైనాపిల్, తేనె

High Level GI : చక్కెర, మిఠాయిలు, స్వీట్ పొటాటో, బ్రెడ్

తినడానికి పద్ధతుంది : ప్రొటీన్, పీచున్న కూరగాయలు, పప్పులు, గింజలు కొబ్బరినూనె కలిపి అన్నం తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ విడుదల నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అన్నంతో పాటు పప్పు, కూరగాయలు, నెయ్యి లేదా మాంసం కలిపి తింటాం కాబట్టి చక్కెర స్థాయిల విషయంలో అంతగా భయం అవసరం లేదని తెలిపారు. అన్నం పరిమితంగానైనా తింటూ, సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. అంతేకాకుండా అన్నం మెల్లగా నములుతూ తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రించవచ్చని, వయసును, శారీరక శ్రమను బట్టి తినే అన్నం పరిమాణంలో మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు. అన్నంలో నిమ్మరసం కలిపి తినటం వల్ల జీఐ తగ్గుతుందని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Join WhatsApp

Join Now

Leave a Comment