స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో భాగంగా ఐదు రోజుల కార్యాచరణ పాటించాలి

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025 లో భాగంగా గ్రామాల పరిశుభ్రతను పెంపొందించేందుకు ఐదు రోజుల కార్యాచరణను అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.శనివారం ఆయన స్వచ్ఛ సర్వేక్షణ్‌ పై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో స్వచ్ఛత పెంపొందించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమం కింద ప్రతి వారం ఐదు రోజుల కార్యాచరణను పాటించాలని సూచించారు. సోమవారం రోజున బహిరంగ ప్రదేశాలు,కార్యాలయాలు, పాఠశాలలు,కళాశాలలు వంటి ఖాళీ ప్రదేశాల్లోని పిచ్చి మొక్కలను తొలగించి, వాటి స్థానంలో ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నాటాలని ఆదేశించారు.మంగళవారం తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం వల్ల లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.ఇక నుంచి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లోనే పొడి చెత్తను సేకరించాలని తెలిపారు.బుధవారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,కళాశాలల్లో పనికిరాని వస్తువులను తొలగించడం,నీటి నిల్వలు లేకుండా చూసేలా చర్యలు తీసుకోవడం,నీటి నిలువుదల చోట్ల ఇంకుడు గుంతలు త్రవ్వే పనులు చేయాలని సూచించారు. గురువారం రోజున డ్రైనేజీల శుభ్రత, దోమల నివారణకు మందుల పిచికారీ, కమ్యూనిటీ మరుగుదొడ్ల శుభ్రత చేపట్టాలని చెప్పారు.శుక్రవారం నాడు ప్రతి ఇంటి ఆవరణంలో మరుగుదొడ్ల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో ఇండ్లలో మరుగుదొడ్ల వాడకం,తడి–పొడి చెత్త వేరు చేయడం,కంపోస్టు షెడ్ల నిర్వహణ,మురుగు నీటి ప్రవాహం,పారిశుద్ధ్యం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఐదు రోజుల కార్యాచరణ ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం మరింత సులభతరం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.రానున్న బుధవారం లోపు ప్రతి గ్రామపంచాయతీలో మ్యాజిక్ సోక్ పిట్లు పూర్తిగా నిర్మించాలి.అలాగే, పిచ్చి మొక్కల నుండి వచ్చిన వ్యర్థాలతో బయోచార్ తయారు చేసి, దానిని మరుగునీటి శుభ్రత, దోమల నివారణకు ఉపయోగించవచ్చని సూచించారు. ప్రతి గ్రామంలో ఏబీసీడి డ్రైవ్‌ల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వనమోత్సవ లక్ష్యాలను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment