యూరియా కొరత లేకుంటే రైతుల క్యూ ఏందీ..!!

_యూరియా కొరత లేకుంటే రైతుల క్యూ ఏందీ..!!_

రైతుకు బస్తా ఇస్తే ఏం సరిపోతుంది..

జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి వివేక్‌కు ప్రశ్నల వర్షం కురిపించిన హరీశ్‌రావు

సిద్దిపేట, జూలై 23 సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, అధికారులు వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసి యూరిత కొరత లేకుండా చూడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీశ్‌రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషనర్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్లాలో ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, ఇది ఏమి సరిపోతుందని ప్రశ్నించారు. ఫర్టిలైజర్‌ షాపుల వద్ద రైతులు క్యూ కడుతున్నట్లు చెప్పారు. గతంలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తున్నదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ జిల్లాలోని సమస్యలపై దృష్టిసారించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ కాలేదని హరీశ్‌రావు అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి, జిల్లాలో 11,353 ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఇంత వరకు ఇయ్యలేదన్నారు.

ఆ డబ్బులు విడుదల చేయాలని కోరారు. జిల్లాలో విత్తనాల కొరత రైతులను ఇబ్బంది పెడుతున్నదని, సమస్య పరిష్కరించాలని హరీశ్‌రావు కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లో గృహలక్ష్మి కింద మంజూరై వివిధ దశల్లో నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లలో బిల్లులు విడుదల చేయాలని కోరారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేకపోవడంతో గ్రామాల్లో చెత్త సేకరణ జరగడం లేదన్నారు.డీజిల్‌ లేక ట్రాక్టర్లు పక్కన పెడుతున్నారన్నారు.ఒక్కో పంచాయతీ కార్యదర్శి తమ సొంత డబ్బులు ఉపయోగించి గ్రామాల్లో పనులు చేయిస్తున్నట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో వైద్య ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేసేవారని, రెండు నెలల నుంచి ఆగిపోయాయని, వాటిని పునరుద్ధరించాలని కోరారు. సిద్దిపేటలో వెయ్యి పడకల దవాఖాన మిగతా నిర్మాణ పనులు పూర్తి చేయించాలని, మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌ నిర్మాణం పూర్తిచేయాలని మంత్రిని హరీశ్‌రావు కోరారు. ఆయుష్‌లో 50 బెడ్లతో సేవలు ప్రారంభించాలన్నారు. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ ఓపెన్‌ చేయాలని, బస్తీ దవాఖానల్లో మందుల సరఫరా చేయాలని, సిబ్బంది జీతాలు రెగ్యులర్‌గా ఇప్పించాలని హరీశ్‌రావు కోరారు.

బస్తీ దవాఖానాల్లో ఏఎన్‌ఎం, ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయిలకు జీతాలు రావడం లేదని, వారికి వెంటనే జీతాలు విడుదల చేయాలని కోరారు. సరిపడా మందులు లేవని మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరిరీల సంఖ్య తగ్గిందన్నారు.ఎస్సీ హాస్టల్స్‌ ప్రారంభించిన రోజే బట్టలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు నెలలైనా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాస్మోటిక్‌ చార్జీలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌లలో ట్యూటర్‌లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. రెవెన్యూలో తహసీల్దార్‌ లాగిన్‌లో ఇంతగా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని ప్రశ్నించారు. మిడ్‌డే మీల్స్‌ పెండింగ్‌ బిల్లులు వెంటనే క్లియర్‌ చేయాలని మంత్రి వివేక్‌ దృష్టికి హరీశ్‌రావు తీసుకువచ్చారు.

*_సమస్యలు పరిష్కరించండి: ఎమ్మెల్యే కొత్త_*

దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… దుబ్బాక నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై మంత్రి చొరవ చూపాలని కోరారు. దళిత బంధు ఇవ్వాలని, అవసరమైన చోట కరెంట్‌ పోల్స్‌ వేయించాలని కోరారు. కూడవెల్లి వాగు, దుబ్బాక కెనాల్‌ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బకి వెంకటయ్య మాట్లాడుతూ.. జిల్లాలో బెస్ట్‌ అవైలబుల్‌ సూల్‌ సీమ్‌ సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 40 కోట్ల నిధులు విడుదల చేయించాలని మంత్రి వివేక్‌ను కోరారు.

*_సిద్దిపేటలో వెయ్యి పడకల దవాఖాన అవసరమా?:_*

మంత్రి గడ్డం వివేక్‌

సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెయ్యి పడకల దవాఖాన అవసరమా? ఇంత పెద్ద దవాఖాన ఎందుకు అంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రిపై విధంగా వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో వెయ్యి పడకల దవాఖాన నిర్మాణం 90 శాతం పైగా పూర్తి అయిందని, మైనర్‌ పనులకు రూ. 25 కోట్లు ఇస్తే పూర్తి అవుతుం డే, 20 నెలల నుంచి పనులు జరగడం లేదని, నిధులు విడుదల చేయించాలని మంత్రి వివేక్‌ను హరీశ్‌రావు కోరారు.

సిద్దిపేట చిన్నదే కదా? అవసరమా? ఎందుకు. ఇప్పటికే చాలా ఉన్నాయి. చెన్నూరూలో కూడా వంద పడకల దవాఖానే ఉంది. ఇక్కడా వంద పడకల దవాఖాన సరిపోతుంది కదా అని మంత్రి వివేక్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో సిద్దిపేటలో రూ. 300 కోట్లతో వెయ్యి పడకల దవాఖాన నిర్మాణం చేపట్టామని హరీశ్‌ చెప్పారు. సిద్దిపేటకే కాకుండా పక్క జిల్లాలకు కూడా ఈ వెయ్యి పడకల దవాఖానలను మంజూరు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్దిపేట ఆభివృద్ధ్దిపై ఎంత కక్ష కట్టిందో మంత్రి వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

*_కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్‌ చేయండి.._*

కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్‌ చేసి కాళేశ్వర జలాలతో జిల్లాలోని రిజర్వాయర్లు నింపి సాగు నీటిని విడుదల చేయాలని మంత్రి వివేక్‌ను హరీశ్‌ రావు కోరారు. రిజర్వాయర్ల కింద పంట కాల్వల నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలన్నారు.

Join WhatsApp

Join Now