ప్రధాన మంత్రి సందేశం..!

ప్రధాన మంత్రి సందేశం..!

బండారు దత్తాత్రేయ రాసిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకం ప్రచురణ గురించి తెలిసి నేను చాలా ఆనందించాను. ఈ పుస్తకం ఆయన జీవిత చరిత్ర మాత్రమే కాదు, అభివృద్ధి పథంలో పయనిస్తున్న ఒక జాతి సజీవ గాథ.

హైదరాబాద్లోని ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన బండారు దత్తాత్రేయ దేశం కోసం, సమాజం కోసం చేసిన పనులు, పోరాటాలు, విజయాల సంగ్రహావలోకనం మనకు ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ఈ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల వృత్తాంతం మాత్రమే కాదు, దీనిలోని ప్రతి అధ్యాయమూ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో ముడిపడి ఉంది. భారతదేశ శాశ్వత విలువలైన సార్వజనిక ప్రజాస్వామ్యం, సాంస్కృతిక ఐక్యత, నిస్వార్ధ సేవల ఉద్వేగభరితమైన వ్యక్తీకరణ ఈ రచన,

ప్రజాసేవ, జాతీయవాదం, సామాజిక న్యాయం పట్ల బండారు దత్తాత్రేయ నిబద్ధత అసాధారణమైనది. ఆయన జీవితంలో పట్టుదల, సేవాస్ఫూర్తి, ఉన్నత విలువలు చాలా ముఖ్యమైనవి.

దేశ చరిత్రపై ‘అత్యవసర పరిస్థితి’ కాలం ఒక మచ్చలాంటిది. ఆ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన చేసిన పోరాటం, ప్రజలతో అనుసంధానం కావడంలో ఆయనకి ఎదురైన అనుభవాలు పాఠకులకు ఆనాటి క్లిష్ట పరిస్థితులను అర్ధంచేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.

ఒక కార్యకర్తగా సంస్థను బలోపేతం చేయడంలోనూ, కేంద్ర మంత్రివర్గంలో ఒక ముఖ్యమైన సహచరుడిగానూ బండారు దత్తాత్రేయ నిరంతరం నాతో ఉండి సహకరించడం చాలా సంతోషకరమైన విషయం. వివిధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో ఆయన అనుభవం, ప్రజా సంక్షేమ భావం ప్రశంసనీయం. గవర్నర్గా కూడా ఆయన దేశాభివృద్ధికి ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు.

‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకం ఆయన జీవితాన్ని, ఆయన గొప్ప వారసత్వాన్ని ప్రజలకు అందించడంలో ప్రభావవంతంగా ఉంటుందని, దేశ పురోగతికి కృషి చేయడానికి భవిష్యత్ తరాలకు ప్రేరణ కలిగిస్తుందని విశ్వసిస్తున్నాను.

ఆయన ఆత్మకథ ప్రచురితమవుతున్నందుకు నా శుభాకాంక్షలు.

న్యూఢిల్లీ,..చైత్ర27,శకసంవత్సరం 1947…17 ఏప్రిల్ 2025

(నరేంద్ర మోదీ)

Join WhatsApp

Join Now