తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డ పద్మ కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ (99) కనుమూశారు. ఇటీవల ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించారు. హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆమె స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం అట్లప్రగడ. అట్లప్రగడ గ్రామానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు దివంగత కాట్రగడ్డ రంగయ్య, అన్నపూర్ణ దంపతుల కుమార్తె దొడ్డా పద్మ.
అట్లప్రగడ గ్రామం వేదికగా అనేక కమ్యూనిస్టు ఉద్యమాలలో, పోరాటాలలో పాల్గొని సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ అడవుల్లో అజ్ఞాతవాసం గడిపారు.
నైజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో పద్మ కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లు ఆమె జైలు జీవితం కూడా గడిపారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) నాయకురాలుగా అనేక బాధ్యతలు నిర్వహించి పలు పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో జరిగిన అనేక పోరాటాలలో పద్మ కీలక పాత్ర పోషించారు
ఆమె భర్త ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత దొడ్డ నరసయ్య అడుగుజాడల్లో నడిచిన పద్మ కమ్యూనిస్టు సీనియర్ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
దొడ్డ పద్మ అకాల మరణం పట్ల పలు రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆమె అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్రం చిలుకూరులో బుధవారం నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.