తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం..
వైన్స్ లైసెన్స్ ఇక మూడేళ్లు!
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ గడువును రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తున్నది.
దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల టెండర్ నవంబర్ 30తో ముగియనుండగా.. వచ్చే టర్మ్ నుంచి దీన్ని అమలు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మూడు రోజులుగా సెక్రెటేరియట్ లో ఎక్సైజ్ శాఖ అధికారులు సమావేశమై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కొత్త టెండర్ల ప్రక్రియను ప్రారంభించి.. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వ్యాపార నిబంధనల్లోనూ కొన్ని కీలక మార్పులు చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. నూతన కంపెనీల బ్రాండ్లను సైతం అనుమతించనున్నట్లు సమాచారం.
మూడేండ్లకు రూ.3 లక్షల డిపాజిట్!
2023–25కు సంబంధించి రూ. 2 లక్షల నాన్ రిఫండ్ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 690 దుకాణాలు ఉన్నాయి.
రెండేండ్ల కాలపరిమితికి ఒక్కో దుకాణానికి రూ.1.05 కోట్లు యాన్యువల్ ఫీజు నిర్ణయించారు. మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో ఈ ఫీజు రూ. 60–80 లక్షలుగా ఉంది. వీటి గడువు నవంబర్ 30తో ముగియనుంది. అయితే వచ్చే టర్మ్ లైసెన్సులకు సంబంధించి యాన్యువల్ ఫీజును కొంత మేర మార్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా టెండర్లలో పాల్గొనాలనుకునే వారు రూ.3లక్షలు ముందస్తు డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. గత టెండర్లలో నాన్ రిఫండ్ డిపాజిట్ ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ. 256 కోట్ల ఆదాయం సమకూరింది. యాన్యువల్ ఫీజుతో కలిపి ఇది రూ.2,460 కోట్లుగాఉంది. కాగా, ఈ సారి ఆదాయం మరింత పెరిగేలా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాలపరిమితి మూడేండ్లకు పెంచుతున్నందున భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
దుకాణాల పెంపు.. కొత్త బ్రాండ్లు!
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. వాటి సంఖ్యను పెంచేలా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. ఎక్కడ ఏర్పాటు చేస్తే ఆదాయం సమకూరుతుందో నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇటీవల ప్రకటించిన నూతన మున్సిపాలిటీల్లో కొత్త దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతోపాటు రూరల్ ఏరియాల్లో సైతం దుకాణాల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. మరోవైపు కల్లు దుకాణాలు మూసివేసిన ప్రాంతాల్లో కూడా కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి గౌడ సంఘాలతో చర్చలు జరపాలనుకుంటున్నారు. అదే విధంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల కోసం 604 కొత్త బ్రాండ్ల నుంచి దరఖాస్తులు రాగా, వచ్చే టర్మ్ నుంచి అనుమతులు ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
లాటరీ పద్ధతిలోనే..
అజామాయిషీ చేసే బేవరేజేస్ సంస్థలు, లిక్కర్ సిండికేట్లకు కళ్లెం వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయంపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. దీనిలో భాగంగా కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పారదర్శంకంగా నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే టెండర్ల ప్రక్రియ నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. పదిహేను రోజుల పాటు టెండర్ల స్వీకరించేందుకు గడువు ఇవ్వనున్నారు. అయితే ఈ సారి కూడా లాటరీ పద్ధతిలోనే దుకాణాల ఎంపిక ప్రక్రియ ఉండనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.