_బిల్లులు రాక.. మిత్తీలు కట్టలేక..!!

*_బిల్లులు రాక.. మిత్తీలు కట్టలేక..!*

మాజీ సర్పంచుల సతమతం

అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు

ఏడాదిగా బిల్లులు ఇవ్వని కాంగ్రెస్‌ సర్కారు

డబ్బుల కోసం సంవత్సరం నుంచీ ఎదురుచూపులు

పోరాటానికి సిద్ధమైన మాజీ ప్రజాప్రతినిధులు

*_నిరసనలను కూడా అనుమతించని_* అ’ప్రజా’ ప్రభుత్వం

ఎక్కడికక్కడ పోలీసులతో నిర్బంధిస్తున్న వైనం

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో మాజీ సర్పంచులు సతమతమవుతున్నారు. ఏడాది కాలంగా బిల్లులు చెల్లించక పోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే డబ్బులు ఇవ్వకుండా సర్కారు సతాయిస్తుండడంపై మాజీ ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటానికి సిద్ధమవుతుంటే పోలీసులను పంపి అరెస్టు చేయిస్తుండడంపై మండిపడుతున్నారు. ప్రజా పాలన అంటే డబ్బులు ఇవ్వకుండా, నిరసన తెలుపనీయకుండా నిర్బంధించడమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

పల్లెల అభివృద్ధి కోసం మాజీ సర్పంచులు ఎంతో కష్టపడ్డారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అదనపు గదులు, పైప్‌లైన్లు, బోర్ల మరమ్మతులు.. ఇలా ఎన్నో పనులు చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అప్పులు తెచ్చి మరీ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారు. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకు సమస్యలు మొదలయ్యాయి. సకాలంలో బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. పల్లెల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన డబ్బులు రాకపోవడంతో సతమతమవుతున్నారు. ఏడాది కాలంగా అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది మిత్తీలు కట్టలేని పరిస్థితికి చేరుకున్నారు. రేవంత్‌ సర్కారు ఇలాగే జాప్యం చేస్తే ఇల్లు, జాగా అమ్ముకోవడం తప్ప తమకు మరో గతి లేదని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*_కేసీఆర్‌ హయాంలోనే ఠంచన్‌గా.._*

కేసీఆర్‌ హయాంలో పల్లెలకు, ప్రజా ప్రతినిధులకూ సముచిత స్థానం దక్కింది. పల్లెప్రగతి పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి బాట పట్టించింది. వేలాది కోట్ల రూపాయలతో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. ఊరూరాడ్రైనేజీలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు ఏర్పాటు చేశారు. రెండు నెలలకోసారి ఠంచన్‌గా గ్రామపంచాయతీ బిల్లులు చెల్లించారు. అలాగే, పంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు క్రమం తప్పకుండా వేతనాలు ఇచ్చారు. సర్పంచులకు, ఎంపీటీసీలకూ గౌరవ వేతనం ఇచ్చారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏడాది కాలంగా బిల్లుల చెల్లింపులు నిలిచి పోయాయి. జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలకు దిగుతున్నారు. పెండింగ్‌ బిల్లుల కోసం మాజీ సర్పంచులు రోడ్డెక్కుతునారు.

*_రూ.కోట్లల్లో బకాయిలు_*

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి మాజీ సర్పంచులకు ప్రభుత్వం రూ.కోట్లల్లో బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేసీఆర్‌ హయాంలో సకాలంలో బిల్లులు రావడంతో ప్రజాప్రతినిధులంతా అప్పులు తెచ్చి మరీ గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు. కానీ కాంగ్రెస్‌ వచ్చాక కథ మారింది. బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ఒక్కో మాజీ సర్పంచ్‌కు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా రావాల్సి ఉంది. ఏడాది కాలంగా డబ్బులు రాకపోవడంతో వారంతా దిగులు చెందుతున్నారు. వడ్డీలు కట్టడానికే పైసలు లేకపోవడంతో సర్కారుపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. కానీ ప్రభుత్వమేమో పోలీసులను దింపి ముందస్తు పేరుతో నిర్బంధిస్తున్నది. అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోతే తాము పనులు చేశామని, కానీ ప్రభుత్వం ఇలా వేధించడం సరికాదని మాజీ సర్పంచులు వాపోతున్నారు. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

*_రూ.38 లక్షలు రావాలె.._*

బడాభీమ్‌గల్‌లో సీసీరోడ్లు, సీసీ డ్రైనేజీలు, బోర్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు చేసేందుకు మిత్తీకి పైసలు తెచ్చి ఖర్చు చేసిన. రూ.38లక్షల బిల్లులు రావాలె. ఏడాది అయిపోయింది. ప్రభుత్వం నుంచి రూపాయి అస్తలేదు. అప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే చిప్ప చేతికొచ్చేటట్లు ఉన్నది. ఖర్చు పెట్టింది ప్రజల కోసమే కదా.. బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం మమ్మల్ని గిట్ల ఇబ్బంది పెట్టుడు కరెక్టు కాదు. వెంటనే పెండింగ్‌ బకాయిలు చెల్లించాలే.

– ఎర్రోళ్ల సంజీవ్‌, మాజీ సర్పంచ్‌, బడాభీమ్‌గల్‌

*_వడ్డీకి తెచ్చి పనులు చేయించిన.._*

అప్పులు తెచ్చి పనులు జేసినం. ఏడాది దాటిపోయింది. ఇప్పుడు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. స్కూల్‌లో టాయిలెట్లు గట్టిన. జీపీ బిల్డింగ్‌ కట్టిన. వరద కాలువ పనులను చేసిన. రూ.17 లక్షల బిల్లులు రావాలే. ఏడాది నుంచి ఒక్క రూపాయీ కూడా ప్రభుత్వం ఇయ్యకపాయే. వడ్డీ ఎట్ల గట్టాలే, అసలు ఎట్ల తెంపాలే అర్థమైతలేదు. ప్రభుత్వం ఇప్పుడన్న మాబాధలను గుర్తించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలే.

– గడ్డం చిన్నారెడ్డి, తాజా మాజీ సర్పంచ్‌, తిమ్మాపూర్‌

*_ఏడాది నుంచి బిల్లులు వస్తలేవు.._*

గ్రామాల్లో సీసీ రోడ్లు, పైప్‌లైన్‌ పనులు, బోర్ల మరమ్మతులు, డ్రైనేజీల నిర్మాణం ఇట్ల అన్నీ రకాల పనులు ప్రజల కోసం చేసినవే. విద్యార్థుల సౌకర్యం కోసం మన ఊరు-మన బడి పనులు చేసినం. దాదాపు రూ.40 లక్షల దాకా అప్పు తెచ్చి ఖర్చు పెట్టినం. ప్రజల కోసమే కదా ఇదంతా చేసింది. కానీ ప్రభుత్వమేమో ఏడాది నుంచి బిల్లులు ఇస్తలేదు. పైసలు రాక చాలా ఇబ్బంది అయితుంది. తాజా మాజీ సర్పంచుల బాధలను ప్రభుత్వం గుర్తించాలి. పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి.

– బోగ ధరణి, మాజీ సర్పంచ్‌, మోర్తాడ్‌

*_కేసీఆర్‌ ఉన్నప్పుడు మంచిగుండె.._*

కాంగ్రెస్‌ ప్రభుత్వం అచ్చినప్పటి నుంచీ బిల్లులు అస్తలేవు. వడ్డీకి తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేసినం. కానీ పైసలు రాక మస్తే పరేషన్‌ అవుతున్నది. కేసీఆర్‌ ఉన్నప్పుడే మంచిగుండె. అప్పట్లో పంచాయతీలకు సంబంధించిన బిల్లులు రెండు నెలల్లోనే అస్తుండే. కానీ ఇప్పుడట్ల లేదు. ప్రజల కోసం ఖర్చు పెట్టిన డబ్బులను ఇయ్యకుండా సతాయించుడు మంచిగ లేదు. ప్రభుత్వం వెంటనే బిల్లులు మంజూరు చెయ్యాలే. డబ్బుల కోసం పోరాటం చేద్దామంటే పోలీసులతోని అరెస్టు చేయిస్తుండ్రు. ఏం జెయ్యాల్నో ఏమో అర్థమైతలేదు.

– పత్తిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, తడ్‌పాకల్‌

Join WhatsApp

Join Now