‘కిడ్స్ విత్ ఖాకీ’తో రోడ్డు భద్రతపై స్పష్టమైన సందేశం
విద్యార్థుల ప్రదర్శనలు అభినందనీయమన్న కలెక్టర్–ఎస్పీ… ప్రమాదాల నివారణకు అవగాహన కీలకం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 14
కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే నిర్లక్ష్యాలు, డ్రంకన్ డ్రైవ్, హైస్పీడ్ వంటి అంశాలను విద్యార్థులు నాటకాలు, ప్రదర్శనల రూపంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఎదుర్కొనే కష్టాలను భావోద్వేగంగా ఆవిష్కరించి ప్రేక్షకులను చైతన్యపరిచారు. ‘సేఫ్ కామారెడ్డి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి రోడ్డు భద్రతపై సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తోందని, తరచూ చేపడుతున్న డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, అవగాహన కార్యక్రమాల వలన ప్రమాదాలు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు రోడ్డు భద్రతపై ప్రభావవంతమైన అవగాహన కల్పించాయని ఆయన అభినందించారు.
ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, తమ కుటుంబాలు, సమాజంలో ట్రాఫిక్ నియమాలపై చైతన్యం కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో చాచా నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్, ఎస్పీ నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ సిఐ నరహరి,పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.