సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసి డాటా ఎంట్రీ ప్రారంభించాలి
*కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్*
ప్రశ్నాయుధం న్యూస్, నవంబర్ 21, కామారెడ్డి :
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాథి, రాజకీయ, కుల సర్వే రానున్న రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి, డాటా ఎంట్రీ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ నుండి మండల ప్రజా పరిషత్, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ … ఇంటింటి సమగ్ర సర్వే పనులు ఎన్యుమారేషన్ బ్లాక్ వారీగా పూర్తి చేయాలని, అదేవిధంగా సేకరించిన వివరాల ఫారాలను ట్రంక్ పెట్టెల్లో భద్రపరచాలని, డాటా నమోదు ప్రారంభించాలని తెలిపారు. అవసరమైన కంప్యూటర్ ఆపరేటర్ లను, వారికి సహాయకులను నియమించుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 11 మండలాల్లో వంద శాతం ఎన్యుమరేషన్ పూర్తయిందని, మిగతా మండలాల్లో రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ వివరాలను డేటా ఎంట్రీ చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 96.3 శాతం ఇన్యుమరేషన్ పూర్తయిందని తెలిపారు. డేటా ఎంట్రీ భద్రంగా తప్పులు లేకుండా నిర్వహించాలని తెలిపారు. ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత ఇన్యుమరేషన్ బ్లాక్ వారీగా నిర్ణీత ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం క్రింద తహసీల్దార్లు అందిన ఫారం 6,7,8 లను పరిశీలించాలని తెలిపారు. తహసిల్దార్ లాగిన్ లో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి. విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, సీపీఒ రాజారాం, మండల ప్రత్యేక అధికారులు వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.