హైడ్రా పేరుతో రూ.5 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ అరెస్ట్:

సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్):

హైడ్రా పేరుతో రూ.5 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. అమీన్ పూర్ మండలంలోని బీరంగూడలో గల జయలక్ష్మి నగర్ నివాసి అయిన జన్వాడే రవి సి.బి.ఆర్ కాలనీలో ఫ్లాటు ఖరీదు చేసి, దానిపై గతంలో G+2 ఇంటి నిర్మాణం చేసి ఉన్నారు. ప్రస్తుతం రెండో అంతస్తు పనులు చేస్తుండగా, రామచంద్రపురం సాయి నగర్ కాలనీ చెందిన దగుడు రాము రిపోర్టర్ అనే వ్యక్తి జన్వాడే రవి బిల్డింగ్ వద్దకు వచ్చి, తన బిల్డింగ్ ప్రభుత్వ స్థలంలో నిర్మించావని, ఇట్టి నిర్మాణానికి G+2 వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయని అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని భయభ్రాంతులకు గురి చేస్తూ, తాను ప్రతి రోజు తహసిల్దార్, ఆర్డీవోలతో ఫోన్ లో మాట్లాడుతానని తెలిపాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్  తనకు బాగా తెలుసునని ఫిర్యాదు యొక్క నిర్మాణం పనులు నిలిపివేయగలనని, ఇలా చేయకుండా ఉండాలంటే తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే బిల్డింగ్ గురించి తన పత్రికల్లో రాసి బిల్డింగ్ కూల్చి వేయిస్తానని, తనకు పాతబస్తీకి చెందిన చాలామంది పహిల్వాన్లు తెలుసునని, డబ్బులు ఇవ్వకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని, జన్వాడ రవి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు బెదిరింపులకు పాల్పడిన రామును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. ఎవరైనా హైడ్రా పేరుతో, బెదిరింపులకు పాల్పడితే అట్టి వ్యక్తుల గురించిన సమాచారాన్ని నేరుగా నా నెంబర్ 8712656777 కు ఫోన్ ద్వారా గాని వాట్స్ ఆప్ ద్వారా గాని సమాచారం అందించాలని, అట్టి వ్యక్తులపై చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ రూపేష్ తెలిపారు.

Join WhatsApp

Join Now