అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా బస్టు – కామారెడ్డి పోలీసుల సూపర్ ఆపరేషన్
12 మంది సభ్యుల ముఠాలో 8 మంది అరెస్ట్ – కోట్ల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం
బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వరకూ విస్తరించిన నెట్‌వర్క్
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 11:
జిల్లా పోలీసులు మరోసారి తమ దర్యాప్తు నైపుణ్యాన్ని చాటారు. అంతర్రాష్ట్ర స్థాయిలో నకిలీ నోట్ల తయారీ, చలామణీ చేస్తున్న భారీ ముఠాను భద్రతా బలగాలు బట్టబయలు చేశాయి. మొత్తం 12 మంది సభ్యుల ముఠాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.3.08 లక్షల నకిలీ కరెన్సీతో పాటు రూ.15,300 అసలు నోట్లను, నకిలీ నోట్ల తయారీలో ఉపయోగించిన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏఎస్‌పీ బి. చైతన్య రెడ్డి పర్యవేక్షణలో కామారెడ్డి టౌన్ ఇన్‌స్పెక్టర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ల ఆధ్వర్యంలో ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అద్భుతంగా ఆపరేషన్‌ను విజయవంతం చేశారు.
వైన్స్‌లో రెండు నోట్లు.. ఆపై పెద్ద గుట్టు రట్టు
సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 23న కామారెడ్డి లోని స్లోకా వైన్స్‌లో మేకల అఖిల్ అనే క్యాషియర్ వద్దకు వచ్చిన వ్యక్తి రెండు ₹500 నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు చేయడంతో అనుమానం వచ్చింది. వెంటనే అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు CR No.551/2025 U/s 179,318(4) BNS, PS Kamareddy కింద నమోదు అయింది.
విచారణలో భాగంగా రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన సిద్ధ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను ఫేస్‌బుక్‌లో నకిలీ కరెన్సీ గ్రూప్‌ల ద్వారా వెస్ట్ బెంగాల్ వ్యక్తి సౌరవ్ డే తో పరిచయమై, రూ.5,000 చెల్లించి రూ.10,000 విలువైన ఫేక్ నోట్లను కొరియర్ ద్వారా తెప్పించుకున్నట్టు ఒప్పుకున్నాడు.
వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ వరకు చైన్
సౌరవ్ డేను పట్టుకునేందుకు పోలీసు బృందం వెస్ట్ బెంగాల్ చేరి అతనితో పాటు హరి నారాయణ భగత్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. విచారణలో వీరు బీహార్‌కు చెందిన ఇబ్నుల్ రషీద్ అనే రసాయన శాస్త్రవేత్త సహాయంతో నకిలీ నోట్ల తయారీ చేస్తున్నట్లు తేలింది.
రషీద్ MSc కెమిస్ట్రీ చదివి, కెమికల్ మిక్సింగ్‌లో నిపుణుడిగా ఉన్నాడు. అతడు ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన మరో 9 మంది తో కలిసి భారీ ముఠా ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఫేక్ నోట్లను పంపిణీ చేస్తూ ఉన్నట్టు వెల్లడించారు.
ఫేక్ కరెన్సీ రాకెట్‌లో దేశవ్యాప్త కస్టమర్ నెట్‌వర్క్
పోలీసు దర్యాప్తులో వీరు దేశవ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాలకు నకిలీ కరెన్సీ సరఫరా చేసినట్లు బయటపడింది. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల పార్టీలు వీరి ‘కస్టమర్లు’.
1:2 నిష్పత్తిలో — అంటే రూ.5,000 చెల్లిస్తే రూ.10,000 విలువైన నకిలీ నోట్లు పంపేవారు. ఈ లావాదేవీలు అంతా సోషల్ మీడియా ద్వారా జరిగేవని పోలీసులు తెలిపారు.
పట్టుబడిన నిందితులు
1. ఇబ్నుల్ రషీద్ (బీహార్)
2. నందులాల్ జంగ్ డే (ఛత్తీస్‌గఢ్)
3. చట్టరామ్ (ఛత్తీస్‌గఢ్)
4. సౌరవ్ డే (వెస్ట్ బెంగాల్)
5. హరి నారాయణ భగత్ (వెస్ట్ బెంగాల్)
6. పండిత్ అలియాస్ శరతక్ జా (వెస్ట్ బెంగాల్)
7. లఖన్ కుమార్ దూబే (యూపీ)
8. దివాకర్ చౌదరి అలియాస్ బ్రిజేష్ కుమార్ (యూపీ)
9. సత్య దేవ్ యాదవ్ (యూపీ)
10. శివ శర్మ అలియాస్ ప్రమోద్ కాట్రే (మహారాష్ట్ర)
11. సిద్ధ గౌడ్ (తెలంగాణ)
12. కృతిక రాజ్
ఇందులో ఇప్పటివరకు ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించగా, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
స్వాధీనం చేసిన వస్తువులు
రూ. 3,08,300 నకిలీ కరెన్సీ
రూ. 15,300 అసలు నోట్లు
Breeza Car (UP 51 BQ 3597)
9 మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, లామినేటర్, ప్రింటర్లు (4), స్కానర్లు, టోనర్లు,
బాండ్ పేపర్లు, ఫాయిల్స్, కట్టర్స్, కలర్స్, సెక్యూరిటీ థ్రెడ్స్, పెండ్రైవ్‌లు తదితర సామగ్రి.
దివాకర్ చౌదరి రూ.4.40 లక్షల నకిలీ డబ్బుతో బ్రీజా కారును కొనుగోలు చేసినట్లు తేలింది.
జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచన
“నకిలీ కరెన్సీ ఎరకు లోనవకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
సోషల్ మీడియా ద్వారా ఇలాంటి మోసపూరిత గ్రూపులను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ఆర్థిక నేరాలను అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలి.” అని ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పేర్కొన్నారు.
పోలీసు బృందాలకు అభినందనలు
ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన
సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, టౌన్ ఇన్‌స్పెక్టర్ నరహరి, సంతోష్ (సీఐ ఎస్‌ఎస్ నగర్), ఎస్ఐలు రాజు, రాజశేఖర్, అనిల్, ఉస్మాన్,
మరియు సిబ్బంది నర్సింగ్‌రావు, రంగా రావు, శ్రీనివాస్ (ఐటీ సెల్), మహేందర్‌రెడ్డి, రాజవీర్, కిషన్, గణపతి, సంపత్, మైసయ్య, రవి, శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, చేతన్, రాజేంద్ర కుమార్, లక్ష్మీకాంత్, విశ్వనాథ్, మధు, లింగం, ఇర్ఫాన్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇక, ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో సహకరించిన భారతీయ రైల్వే అధికారులు, వివిధ రాష్ట్రాల పోలీసులు కు కామారెడ్డి పోలీసు శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.