ఏపీలో తల్లికి వందనం పెండింగ్ నిధుల విడుదల పై కీలక అప్డేట్

ఏపీలో తల్లికి వందనం పెండింగ్ నిధుల విడుదల పై కీలక అప్డేట్

అమరావతి :

తల్లికి వందనం పెండింగ్ నిధుల విడుదల పై కీలక అప్డేట్. సూపర్ సిక్స్ పథకం అమల్లో భాగంగా ప్రభుత్వం జూన్ నెలలోనే అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది.

అర్హత ఉండీ నిధులు అందని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తల్లికి వందనం పథకం నిధులు 2.79 లక్షల మందికి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో, తల్లులు వాటి కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం వీరికి నిధుల చెల్లింపు పైన కసరత్తు చేస్తోంది.

కూటమి ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు జమ చేసింది. జూన్‌లో 63,77,898 మంది విద్యార్థులకు సంబంధించి 8291.27 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో జమయ్యాయి. కొంతమంది తల్లుల ఖాతాల్లో నిధుల జమపై ప్రతిష్టంభన ఏర్పడింది.

వేర్వేరు కారణాల వల్ల నిధుల జమకాక సచివాలయాల్లో గ్రీవెన్సు ద్వారా తిరిగి దరఖాస్తులు చేసుకున్న వారిలో 2,79,720 మందికి రూ.363.64 కోట్లు విడుదలకు దాదాపు రెండు నెలల క్రితమే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ప్రక్రియ ప్రాసెస్‌లో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. సచివాలయాల్లో పెద్ద ఎత్తున గ్రీవెన్సులో దరఖాస్తు చేసిన వారికి ఇంతవరకు ఎటువంటి సమాచారమూ రాలేదు.

దీంతో, విద్యార్థుల తల్లులు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో చైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాల నమోదులో సాంకేతికంగా చిన్నపాటి తప్పు దొర్లినా తల్లుల ఖాతాల్లో నిధులు జమకాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం… విద్యార్థులు, వారి తల్లి, తండ్రి లేక సంరక్షకుల ఆధార్‌ నెంబర్లు చెల్లుబాటులో ఉండాలి. సరాసరి నెలకు 300 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండరాదు. ఆదాయం పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.

అయితే, ఎక్కువమంది 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం కింద అనర్హులుగా నిలిచారని అధికారులు చెప్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కొంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.7 వేలు, కొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.9 వేలు జమ అయ్యాయి. దీంతో, ఇప్పుడు వీరి నిధుల విషయం పైన కసరత్తు మొదలైనట్లు సమాచారం. త్వరలోనే వీరి ఖాతాల్లో నిధుల విడుదల దిశగా నిర్ణయం జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment