వాస్తవాలు చూపని జాతీయ మీడియా- ప్రభుత్వ వైఫల్యాలను పక్కనబెట్టి టీఆర్పీల కోసం పాకులాట
మోడీకి అనుకూలంగా వార్తలు, చర్చలు
బాధ్యత విస్మరిస్తున్న ‘నాలుగో స్తంభం’
పరీక్షల స్కామ్లపై కొన్ని నివేదికలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కేంద్ర బడ్జెట్లోని విస్తృత అంశాలు కూడా కేంద్రంపై ప్రత్యక్ష దాడిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా మధ్య తరగతి ప్రజల నడ్డి విరిగిపోయే ప్రమాదమున్నదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రముఖ మీడియా ఛానెళ్లను కార్పొరేటు సంస్థలు చేజిక్కించున్నాయనీ, ఇందులో అదానీ, అంబానీలు కూడా ఉన్నారని మేధావులు గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ వర్గం మీడియా మాత్రం మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా.. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నదని అంటున్నారు.
కేంద్రంలోని మోడీ పదేండ్ల పాలనను భారత్లోని ప్రజలు చూశారు. 2014 నుంచి 2024 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అనేక చట్టాలు, విధానాలు, కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో మెజారిటీ తగ్గినా.. మోడీ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చింది. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లోఅవకతవకల నుంచి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ వరకు.. ప్రతీదీ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మోడీ సర్కారు తీరుపై ప్రశ్నల వర్షం గుప్పించింది. పరీక్షల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు కేంద్రం వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇక గతనెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై దేశంలో మధ్య తరగతి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, జాతీయ మీడియా మాత్రం ఈ జనాగ్రహాన్ని దాచిపెడుతున్నది. మోడీ సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుతున్నది. కేంద్ర సర్కారుకు అనుకూలంగా వార్తలు, కథనాలు, చర్చలను చేపడుతున్నది. కేవలం
టీఆర్పీ రేటింగ్స్ ధ్యేయంగా జాతీయ మీడియా పని చేస్తున్నదని మేధావులు, విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పేరున్న మీడియా తన బాధ్యతను విస్మరిస్తున్నదనీ, భారత్ వంటి దేశానికి ఇలాంటి తీరు ఏ మాత్రమూ యోగ్యం కాదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘మధ్యతరగతి అసంతృప్తి సంకేతాలు గత రెండేండ్లుగా మునిగిపోయాయి. అది ఒక్కోసారి లావాలా విరుచుకుపడుతుంది. అధికారాన్ని ప్రశ్నించే వారెవరైనా దేశ వ్యతిరేకులని మోడీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నది. ఇది చాలా ప్రమాదకరం’ అని మేధావులు అంటున్నారు.
పన్ను చెల్లింపుదారుల నుంచి తీసుకున్న సొమ్మును కూలిపోతున్న వంతెనలు, శిథిలావస్థలో ఉన్న విమానాశ్రయాల కోసం వినియోగిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో నీళ్లతో నిండిన, గుంతలమయమైన రోడ్ల గుండా తిరుగుతున్నప్పుడు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనీ, వీరి గొంతును
మాత్రం సదరు మీడియా వినిపించటంలేదని చెప్తున్నారు. ప్రజలు పన్నులు చెల్లిస్తారు, కానీ ప్రతిఫలంగా ఏమీ పొందలేరని అంటున్నారు. వారు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు వెళ్లి, తమ గొంతును వినిపించాల్సి వస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
2009లో మళ్లీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే యూపీఏ-2 అన్నా హజారే ఆందోళన రూపంలో పెద్ద ఎదురుదెబ్బను చూసింది. ఆ సమయంలో, 2008-09 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనంతర పరిణామాలను ఎదుర్కోవటానికి ప్రపంచం ఇంకా ప్రయత్నిస్తున్నది. కానీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేయటం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని పూడ్చింది. పే కమీషన్ ద్వారా నడిచే బకాయిల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద బొనాంజా ఇచ్చింది. ఇది కొన్ని సంవత్సరాల పాటు డిమాండ్ను కొనసాగించటంలో సహాయపడింది. కానీ, మోడీ పానలో ఇలాంటి విధానం కరువైందని ఆర్థిక నిపుణులు, వివ్లేషకులు అంటున్నారు.మోడీ పాలనలో మధ్యతరగతి ఆదాయాలు పడిపోయాయని గణాంకాలు చెప్తున్నాయి. పారిస్ ఆధారిత ప్రపంచ అసమానత ల్యాబ్స్ చేసిన ఆదాయ అంచనాల ప్రకారం.. అగ్రశ్రేణి 0.5 శాతం కుటుంబాలు మినహా, ధనవంతులైన 10 శాతం మంది వ్యక్తులు గత కొన్ని సంవత్సరాల్లో వాస్తవ ఆదాయ వృద్ధిని చాలా తక్కువగా కలిగి ఉన్నారు. ప్రస్తుతం దేశంలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మరణాలు, పదేపదే రైలు ప్రమాదాలు జరిగినా.. అంతగా చర్చకు రావటం లేదనీ, ఇందుకు మోడీ మీడియా మేనేజ్మెంట్ కూడా కారణమని విమర్శకులు అంటున్నారు. మోడీ మిత్రుల చేతుల్లోనే ప్రధాన ఛానెళ్లు ఉండటం ఇందుకు కారణమని చెప్తున్నారు. అయితే, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు కొన్ని ఈ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రజలు పడుతున్న బాధలను వెలుగులోకి తెస్తున్నాయని మేధావులు, విశ్లేషకులు అంటున్నారు. మీడియా అనేది పాలక పక్షానికి ప్రతిపక్షంలా ఉండాలనీ, సమస్యలపై నిలదీయాలనీ, కానీ ప్రస్తుతం మోడీ పాలనలో దేశంలో అలాంటి పరిస్థితులు మాత్రంకనబడటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు