సమ భాగస్వామ్యంతోనే హింస లేని సమాజం

సమ భాగస్వామ్యంతోనే హింస లేని సమాజం

– వ్యాసకర్త : కె. స్వరూపరాణి, ‘ఐద్వా’ పూర్వ రాష్ట్ర కార్యదర్శి

మహిళలు, బాలిలకలపై జరుగుతున్న హింస నిర్మూలన కోసం నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా విస్తృత క్యాంపెయిన్‌ చేయాలని 1981లో యునెస్కో ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. 4 దశాబ్దాలు గడిచినా మహిళలపై హింస బహు రూపాల్లో పెరుగుతూనే ఉంది.

ఇంటా బయటా మహిళలు, బాలికలపై జరుగుతున్న హింస వ్యక్తిగత వ్యవహారం కాదు. సమాజం, కుటుంబం, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ మహిళలకు న్యాయం, భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలి. కానీ ఆ విధమైన చర్యలు లేవు. స్త్రీల శరీరాన్ని ఒక ప్రాపర్టీగా చూస్తున్నారు. స్త్రీలు ‘నో’ అంటే వారి అభిప్రాయానికి విలువ, గౌరవం ఇవ్వకపోగా సామూహిక లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, స్వామీజీలు, బాబాలు, న్యాయవాదులు, మహి ళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వారిపై కేసులు నమోదు కావు. ప్రజాగ్రహంతో నమోదయినా రాజకీయ నాయకుల పలుకుబడితో శిక్షల నుండి తప్పించుకుంటారు. మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు వారి వస్త్రాలు, హావభావాలు, ప్రవర్తన రెచ్చగొట్టే విధంగా ఉండటం వలనే నేరాలు జరుగుతున్నాయని రాజకీయ నాయకులే నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగేళ్ళ చిన్నారుల మీదా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. విధి నిర్వహణలో వున్న కలకత్తా జూనియర్‌ డాక్టర్‌ మీదా పాశవిక హత్యాకాండకు పాల్పడ్డారు. దీనికి ఈ పెద్ద మనుషులు ఏం సమాధానం ఇస్తారు?

మానవత్వాన్ని మరిచిపోయి మహిళలను సరుకుగా చూపే విష సంస్కృతి కొత్త రూపాల్లో రాజ్యమేలుతున్నది. వ్యాపార ప్రకటనలు, సినిమాలలోనూ వ్యాపార కోణంతో స్త్రీని అసభ్యంగా చిత్రీకరిస్తున్నారు. ఏ వస్తువులు అమ్ముకోవాలన్నా స్త్రీల ఆత్మగౌరవాన్ని, అంగాంగాలను ఎర చూపాల్సిందే!

1986లో అశ్లీల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినా ఆ తర్వాత సోషల్‌ మీడియా, టీవీలు, ఇంటర్‌నెట్‌, యూట్యూబ్‌ వంటి వాటికి వర్తింపచేస్తూ 2000లో ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ (ఐ.టి) చట్టం చేశారు. ఇందులో సెక్షన్‌ 67 కింద అసభ్య, శృంగార చిత్రాలను (పోర్నోగ్రఫీ) తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. ఒక మహిళ మీద జరిగిన దాడి ఆమె జీవించే హక్కు పైన, గౌరవంపైన దాడి వంటిది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రభుత్వాలు ఘటన జరిగినప్పుడు కంటితుడుపు చర్యలు తప్ప నేరాలను అరికట్టేందుకు నివారణా చర్యలు లేవు. మాదక ద్రవ్యాలు, మత్తు మందులు, అశ్లీల సినిమాలు, సాహిత్యం, సోషల్‌ మీడియా, సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాల వలన వయస్సుతో నిమిత్తం లేకుండా పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు బలవుతున్నారు.

గడప లోపలా హింసే

మహిళలపై జరుగుతున్న హత్యల్లో 28 శాతం కుంటుంబ సభ్యులే చేస్తున్నారని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో లెక్కలు చెప్తున్నాయి. మహిళలు భర్త, సన్నిహిత కుటుంబ సభ్యుల చేతుల్లోనే హతమవుతున్న ఘటనలు ఎన్నో. 2022లో ఆత్మహత్య చేసుకున్న 45,028 మందిలో సగానికి పైగా గృహిణులే వున్నారు. 2022లో భారత్‌లో ఎన్‌.సి.ఆర్‌.బి నివేదిక ప్రకారం బాలికలు, మహిళలపై 4,28,000 కేసులు నమోదయ్యాయి. అందులో 7.9 శాతం అత్యాచార కేసులు, 21.8 శాతం భౌతిక దాడులు, 31.8 శాతం గృహ హింస కేసులు నమోదైనట్లు నివేదిక తెలుపుతున్నది. నమోదు కాని కేసులు లెక్కకు మించి ఉన్నాయి. 2030 నాటికి మహిళలకు, బాలికలకు సాధికారిత, లింగ సమానత్వాన్ని సాధించాలని ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఐదవదిగా పేర్కొంది. స్త్రీ పురుషుల మధ్య ప్రాకృతిక విభజనను సామాజిక కోణం నుంచి అర్ధం చేసుకోవటానికి బదులుగా… సామాజిక అసమానతలకు ప్రకృతిని అన్వయించి ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ధోరణి సహించరాని విషయం.

సమాజంలో స్త్రీ పురుష అంతరాలు

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కేటాయింపు విషయంలో మన రాజకీయ నాయకులు 1996 నుండి తగవులాడుకుంటూనే ఉన్నారు. ప్రజాస్వామ్య సంస్థలన్నింటిలోనూ స్త్రీలు చురుకుగా పాల్గొనడం సాధికారిత సాధనకు అత్యంత అవసరం. మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో నిరాఘాటంగా పాల్గొనేంత వరకు వారి హక్కులు నిరాకరింపబడుతూనే ఉంటాయి. బాలికలకు ఉన్నత చదువులు, ఉద్యోగ, నైపుణ్యాలతో పాటుగా పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలి. స్త్రీ పురుష అక్షరాస్యతల మధ్య 17.2 పాయింట్ల తేడా ఉంది. రాజకీయ సాధికారిత సూచికలో భారతదేశం స్థానిక సంస్థల్లో కొంత మెరుగ్గా ఉన్నా విధాన నిర్ణయాలు చేసే పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. 543 స్థానాలలో సుమారు 800 మంది మహిళలు పోటీ చేయగా 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. 2019 కన్నా 4 సీట్లు తగ్గాయి. మొత్తం 13.6 శాతమే. మహిళా రిజర్వేషన్‌ బిల్లు 2023లో పార్లమెంట్‌లో ఆమోదం పొందినా కుంటి సాకులు చెప్తూ అమలు చేయలేదు. బిల్లు అమలైతే 181 మంది మహిళలు లబ్ధి పొందేవారు.

న్యూఢిల్లీ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం విడుదల చేసిన గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు-2024 ప్రకారం భారతదేశం 146 దేశాల్లో 129వ ర్యాంకులో ఉంది. ఈ తిరోగమనం విద్య, రాజకీయ సాధికారితలో క్షీణత ఫలితమే!

నాగరిక సమాజానికైనా పునాది మానవ హక్కులే. మహిళల హక్కులు లేకుండా మానవ హక్కులు లేవు. ఐక్యరాజ్య సమితి 1948 అక్టోబర్‌ 10 సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన రూపొందించింది. ఆ ప్రకటనలో ప్రజలందరూ వారి జాతి, మతం, లింగ బేధం లేకుండా విద్య, రాజకీయ, ఆర్థిక హక్కులను, మనిషి గౌరవంగా బతకటానికి కావల్సిన హక్కులన్నింటినీ పొందే హక్కును ప్రకటించింది.

అయినప్పటికీ జనాభాలో సగభాగంగా వున్న మహిళలు అన్ని విధాలా వెనుకబడే ఉన్నారు. స్త్రీల పట్ల వివక్షను నిర్మూలించేందుకు 1979 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి (యు.ఎన్‌.ఓ) ఆధ్వర్యంలో జరిగిన సదస్సు స్త్రీల హక్కులు మానవ హక్కులని పేర్కొంది. స్త్రీ పురుషుల మధ్య అసమానత దేశాభివృద్ధికి ఆటంకం. స్త్రీలు, బాలికల ప్రాథమిక హక్కులు మానవ హక్కుల్లో అంతర్భాగమని, వాటిని ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలంది. సమాజంలోని అన్ని రంగాలలోనూ, అధికారాల లోనూ, నిర్ణాయాత్మక సంస్థలలోనూ మహిళలు సమ భాగస్వాములైనప్పుడే హింస లేని సమాజంతోపాటు, అభివృద్ధి, శాంతి, సమానత సాధ్యమని యు.ఎన్‌.ఓ వెల్లడించింది. ఆ దిశగా ప్రభుత్వాలు కచ్చితమైన నిర్ణయాలు చేసి అమలు జరపాలి.

– వ్యాసకర్త : కె. స్వరూపరాణి, ‘ఐద్వా’ పూర్వ రాష్ట్ర కార్యదర్శి

Join WhatsApp

Join Now

Leave a Comment