కళా, సాహితీ రంగాలకు “కిరీటం”.. సహజ కవికి సెల్యూట్.. 

కళా, సాహితీ రంగాలకు “కిరీటం”..

* సహజ కవికి సెల్యూట్.. 

* అవమానింపబడ్డవాళ్లకు అందలం.. 

 ఉద్యమ నేపథ్యంలేని శాసనకర్త నిర్ణయాలు శభాష్.. 

* కవులు ప్రజాపక్షం, ధిక్కార స్వరాలు.. 

తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ మట్టి వాసనలు అంటేనే గుర్తుకువచ్చేది “ఉద్యమం” భావుటాలు. ఆ స్ఫూర్తియే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చేలా చేసింది. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మాత్రం ఈ ప్రాంత కవులు, కళాకారులు తదితరులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ఉద్యమ నాయకులు అని చెప్పుకొనే వారు వీరిని కలవడానికి కానీ, చూడటానికి కూడా ఇష్ట పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవులకు, కళాకారులకు పెద్ద పీట వేస్తూ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 సహజ కవికి “సెల్యూట్”..

తెలంగాణ రాష్ట్రంలో “అందెశ్రీ” ని సహజ కవిగా పిలుచుకుంటారు. నిరక్షరాస్యుడు, దళితుడైనా ఈయన అసలు పేరు “అందె ఎల్లయ్య”. గతంలో గొప్పగా చదువుకోకపోయినా పుట్టి పెరిగిన ప్రాంతంపై ఈయనకు ఉన్న ప్రేమ ఉద్యమం వైపు నడిపించింది. ఈయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” గేయం. రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఈ గేయం. దీని రచయిత అందెశ్రీ స్వరాష్ట్రంలో తీవ్ర నిరాధరణకు గురయ్యారు. రాష్ట్రం వచ్చాక రాష్ట్ర గేయంగా ప్రకటిస్తాం అన్న ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర గేయంగా ప్రకటించడం మాట దేవుడు ఎరుగు, కవులు, సాహితీ వేత్తలను కలవడానికి కూడా ఇష్ట పడకపోవడం తెలంగాణ సమాజాన్నే ఆశ్చర్యపరిచింది. మూడోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక “అందెశ్రీ” కి సముచిత స్థానం కల్పించి గౌరవించింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు సంగీతం అందించినటువంటి ఎంఎం కీరవాణి దర్శకత్వంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో రూపుదిద్దుకోవడమే కాక, తెలంగాణ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఆ రోజు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ప్రకటించడంతో గత ప్రభుత్వ హయాంలో అణచివేతకు గురికాబడ్డ కవులు, కళాకారులకు రక్షణగా నిలిచే ఈ నిర్ణయం “సాహితీ సారస్వత “ప్రియులను ఎంతగానో ఆనందింపచేసిన సందర్బం.

 స్వరాష్ట్రంలో అవమానింపబడ్డవాళ్లకు అందలం..

మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి కారణం మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారి. ఆనాడు ఉన్న తెలంగాణ ప్రాంత పరిస్థితి, ఉద్యోగ నియామకాలలో పరాయి పాలకులు చూపిస్తున్న వివక్షను గ్రహించి తన తల్లికి ఈ ప్రాంత బిడ్డల జీవితాలు మారాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అమృత సంజీవని అని చెప్పి హైద్రాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చేతిలో తన సుసైడ్ నోట్ పెట్టి ప్రాణ త్యాగం చేసుకొని విద్యార్థులను ఉద్యమం వైపు తిప్పిన శ్రీకాంత్ చారి కుటుంబం కూడా స్వరాష్ట్రములో నిర్లక్ష్యం కాబడ్డదన్నది జగమెరిగిన సత్యం. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు, అన్యాయానికి గురికాబడి, పరాయి పాలనలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ ప్రాంతం ఎంతో మంది అమరుల బలిదానాల తర్వాత, సకల సబ్బండ వర్గాల పోరాటాల తర్వాత తెలంగాణ తల్లి దాస్యశృంకలాలు తెంచుకొని స్వరాష్ట్రంగా ఏర్పడింది. అందరు అనుకున్నట్టు రాష్ట్రం కోసం పోరాటం చేసిన వర్గాలకు కాని, ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండవల్సిన ఆనాటి ప్రభుత్వం అసలు వారిని దగ్గరకు కూడా రానియ్యలేదు. ఒకానొక సందర్బంలో అమరులను గుర్తించడం కోసం ప్రభుత్వ కమిటీలు వేయడం అంటే ఒక తల్లి తన కడుపులో పుట్టిన పిల్లలు చనిపోతే తల్లి వారిని గుర్తించడం కోసం కమిటీ వేసుకుందాం అన్న చందంగా ఉందనే ప్రశ్న ఉద్యమకారులను, మేధావి వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నో ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు అందలం ఎక్కించింది కేసీఆర్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో “గద్దర్” లాంటి ప్రజాయుద్ధ నౌక ప్రభుత్వ అధినేత కేసీఆర్ ను కలవడం కోసం గేటు వద్ద పడిగాపులు కాయడం, ప్రభుత్వ అధినేత ఆయనను కలవకపోవడం అందరి మనసులను కలచివేసిన సంఘటన. జానపదం అంటే జనపదం అని, “మాభూములు మాకేనని” మలి దశ ఉద్యమాన్ని తట్టి లేపిన ప్రజాకవి, ప్రజా యుద్దనౌక “గద్దర్” అలియాస్ గుమ్మడి విఠల్ రావు. గద్దర్ “అంటేనే విప్లవం”. తన పాటలతో ఎంతోమందిని ఉద్యమం వైపు తిప్పిన వ్యక్తి గద్దర్. ఏనాడూ పదవుల కోసం కానీ, పైసల కోసం పాకులాడని వ్యక్తి గద్దర్. బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారా రాజ్యాధికారాన్ని సాధించు కోవచ్చునని పరాయి పాలకుల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన వ్యక్తి గద్దర్. గత ప్రభుత్వం గద్దర్ ను అవమానించినంత పనిచేసినా, ప్రస్తుత ప్రభుత్వం అయన కూతురికి సాంస్కృతిక శాఖను అప్పగించి, ఆశాఖను ఆమె చేతిలో పెట్టి, దానికి ఆమెను సారధిని చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇది “గద్దర్” కు కాదు కళా ప్రపంచానికే ఇచ్చిన గొప్ప గౌరవంగా అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే నిర్ణయమని తెలంగాణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్న సందర్బం.

* ఉద్యమ నేపథ్యంలేని శాసనకర్త నిర్ణయాలు “శభాష్”..

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి చెప్పుకోదగిన సంబంధం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈయన ఉద్యమ నేపథ్యంలేని నాయకుడే అయినప్పటికీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు అనుగుణంగా కవులకు, కళాకారులకు పెద్ద పేట వేస్తూ, వారి గౌరవాన్ని పెంచే రకంగా ఈ ప్రభుత్వం తీస్కుంటున్న నిర్ణయాలు అందరిని సంతృప్తి పరుస్తూనే ఒకింత షాక్ కి గురిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ఉద్యమ ద్రోహి అని తీవ్రంగా ప్రచారం చేసి, పదునైన విమర్శలు చేసిన ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలను అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే అదిగమించి తిప్పికొడుతూ సాహితీ రంగాన్ని రక్షించుకునే నిర్ణయం తీస్కొని ఆ వర్గానికి ఒక రక్షకుడిగా నిలిచారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సేవ చేయడానికి గొప్ప మనసు ఉండాలే కానీ ఉద్యమ నేపథ్యం కాదు అని ఆయన చెప్పకనే చెబుతున్నట్టు ఉన్నారు. ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్లు చెయ్యలేని పనులు ఈయన చేస్తూ అందరి విమర్శలకు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. సరే ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారు తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలను స్వాగతించాలని రాజకీయ విశ్లేషకులు, మేధావులు విశ్లేషిస్తున్నారు.

 కవి గళాలు, ధిక్కార స్వరాలు..

కవులు ఎప్పుడైనా ప్రజాపక్షమే. కవులు శ్రామిక, కార్మిక వర్గాల గొంతుకగా ముందుకు సాగుతుంటారు. సమాజంలో కొన్ని వర్గాలు అణిచివేతకు, దోపిడీకి గురవుతున్నప్పుడు కవులు ప్రజల అభిప్రాయాన్ని తమ కవిత్వం ద్వారా, పాటల ద్వారా, తమ బాణిల ద్వారా ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తూ గొంతులేని వారికి తమ గొంతును అందిస్తారు. దాశరథి, కాళోజి వారసత్వాలను పునికి పుచ్చుకున్న ఈ ప్రాంతంలో ఎప్పుడు ఉద్యమాలే ఉంటాయి. ప్రజాస్వామ్య భారతంలో ప్రశ్నించే దానిలో కవుల పాత్ర కీలకం. కవులు సమాజంలో ప్రభుత్వాన్ని మంచి పనులు చేసినప్పుడు వినమ్రంగా స్వాగతిస్తాయి. ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు తీవ్ర స్వరంతో కాకున్నా తమ కలానికి పదును పెట్టి ప్రభుత్వాన్ని నిద్ర లేపుతారు. కాబట్టి ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఎలాగైతే కవులు స్వాగితించిన తీరును ఎలాగైతే స్వీకరిస్తుందో, తప్పులను ఎత్తిచూపినప్పుడు అదే విధంగా స్వీకరించాలి, గౌరవించాలి. కవులపై నిర్భందాలు పెట్టి అణిచి వేయాలని చూస్తే ఉద్యమాలు పుట్టి అశాంతి నెలకొలిపే తప్పులను చేయరాదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు అందరిని హర్షింపచేసే విధంగా ఉన్నప్పటికీ భవిష్యత్ కాలంలో కవులు, కళాకారుల విషయంలో ఎలా వ్యవహారం చేస్తుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now

Leave a Comment