తొలి స్వాతంత్య్ర సమరయోధుడు
స్వాతంత్య్రాన్ని సంకల్పించిన మొదటి భారతీయుడు
‘రాష్త్రీయ స్వతంత్ర సంకల్ప దివస్ ‘ గా లహుజీ సాళ్వే జయంతి !
లహుజి రఘోజీ సాళ్వే ప్రస్తుత మహారాష్ట్ర లోని పూణే సమీపంలోని ‘ పేత్ ‘ అను గ్రామంలో విఠాబాయి – రఘోజీ సాళ్వే మాంగ్ దంపతులకు నవంబర్ 14, 1794 రోజున జన్మించారు.. వారసత్వంగా, తండ్రి నుంచి లహుజి అన్ని రకాల యుద్ధ కళల యందు ప్రావీణ్యం పొందాడు.
మాతృభూమి కోసం పోరాటం :
గొప్ప యోధుడైన లహుజి తండ్రి మరాఠా రాజ్యానికి చెందిన శికార్ ఖానా కు ఆధిపతి. 05.11.1857 రోజున ఖడికి వద్ద మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ప్రారంభం కాగా, తన తండ్రికి సహాయంగా లహుజి ఆ యుద్ధంలో పాల్గొని, తండ్రికి తగ్గ తనయుడులాగా అత్యంత ధైర్యసాహసాలతో రణభూమిలో తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతిలో మరాఠా సైన్యం ఓడిపోవడం మరియు మాతృభూమి రక్షణకై పన్నెండు రోజులపాటు బ్రిటిష్ సైనికులతో వీరోచితంగా పోరాటం చేసిన తండ్రి, కళ్ళ ముందే అమరవీరుడు కావడం చూసిన లహుజి, రణభూమిలో తండ్రికి నివాళి అర్పిస్తూ ” మరెల్ తర్ దేశా శాటి, జగేల్ తర్ దేశా శాటి ‘ ( అనగా దేశ స్వాతంత్య్రం కోసం వీరమరణమో లేదా ప్రాణం ఉన్నంతవరకు దేశం కోసమే జీవించడం ) అనే విప్లవాత్మకమైన ప్రతిజ్ఞ చేసి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించడానికి మరియు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడే విప్లవ సైన్యమును సృష్టించాలని దృఢ నిర్ణయాన్ని తీసుకున్నాడు.
1822 సంవత్సరంలో నానా రాస్త్ సర్దార్ సహకారంతో పుణెలోని ‘రాస్తాపేత్’లో ఒక వ్యాయామశాల (అఖాడా) ప్రారంభించాడు. ఇది దేశంలోనే మొట్టమొదటి యుద్ధనైపుణ్య శిక్షణ కేంద్రం. ఈ శిక్షణ కేంద్రంలో లహుజి తనకు వారసత్వంగా లభించిన అన్నిరకాల యుద్ధకళలను యువకులకు నేర్పిస్తూ, వేల మంది స్వాతంత్య్ర పోరాట వీరులను తయారుచేశాడు. మహాత్మా జ్యోతిబా ఫూలే , క్రాంతి భౌ ఖరే, ఉమాజీ నాయక్, క్రాంతివిర్ నానా దర్బరే, వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే , బాల గంగాధర్ తిలక్ , గోపాల్ గణేష్ అగార్కర్ , చాపేకర్ బంధువులు, సదాశివరావు గోవాండే, నానా మొరాజి మొదలగు వారు లహుజి శిష్యులే. లహుజికి అతంత్య ప్రియులు మరియు కళ్ళులాంటి వారు మాత్రం మహాత్మా జ్యోతిబా ఫూలే మరియు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే అని చెప్పవచ్చును. అంతేకాకుండా అతను 1857 లో జరిగిన తొలి స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నాడు.
మంచి సమాజం కోసం పోరాటం :
తన పరాక్రమ శక్తిసామర్థ్యాలతో 1848 సంవత్సరంలోనే పూణే యందు అందరికి వివక్షలేని మంచి త్రాగునీటి సదుపాయాన్ని కల్పించాడు. పూణేలో 25.12.1847 రోజున జరిగిన విద్యా సదస్సుకు ఆధ్యక్షత వహిస్తూ, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆధ్వర్యంలో బాలికల విద్యకై ప్రాధాన్యతనిస్తూ, బాలికల పాఠశాలలు స్థాపించాలని తీర్మానించాడు. దేశంలోనే ప్రపథముగా సావిత్రిబాయి ఫూలే మరియు ఫాతిమా షేక్ మహిళా ఉపాధ్యాయులుగా బాలికల కోసం మొదటి పాఠశాలను 01.01.1848 రోజున భిడేవాడలో ఏర్పాటుచేయగా, ఇది నచ్చని వారు, మహాత్మా జ్యోతిబాఫూలే దంపతులపైన మరియు ఫాతిమా షేక్ పైన దాడులకు దిగుతున్నారని తెలుసుకొన్న లహుజి పూణే లో దండోరా వేయించి ఇక నుంచి వీరికి చీమ కుట్టిన మీకు పుట్టగతులు ఉండవని హెచ్చరించాడు. అంతే కాకుండా చదువుకోవడానికి వచ్చే విద్యార్థులతో పాటు, బాలిక పాఠశాలలకు కూడా తాను రక్షణకవచంగా నిలబడ్డాడు. అప్పటి నుంచి జ్యోతిబా ఫూలే దంపతులతో పాటు ఫాతిమా షేక్ మరియు ఉస్మాన్ షేక్ అను అన్నాచెల్లెళ్లు కూడా తమ సంఘ సేవలను విజయవంతంగా నిర్వహించుకోగల్గారు.
వేల మంది స్వాతంత్య్ర పోరాట వీరులను తయారుచేసిన, లహుజికి తన ప్రియ శిష్యుడు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే ను బ్రిటిష్ వారు ఖైదు (20.07.1879) చేశారనే సమాచారం అందగా, దిగులుతో 17.02.1881 న 87 సంవత్సరాల వయస్సులో స్వర్గవాసులు కావడం జరిగింది. వీరి సమాధి ప్రస్తుతం పుణెలోని ‘సంగం వాడి’ వద్ద కలదు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం లహుజి గారి సమాధి పరిరక్షణ భాద్యతలు తీసుకున్నది.. లహుజి గారిని అందరు ప్రేమతో ఆధ్యా క్రాంతివీర్, ధర్మవీర్, క్రాంతి గురు, ‘లహుజిబువా మాంగ్’ మరియు ‘వస్తాద్’ అనే వివిధ పేర్లతో పిలిచేవారు.
భారతదేశం యొక్క చరిత్ర గతిని మార్చిన మహాపురుషులలో ఆగ్రగణ్యుడుగా గుర్తింపుపొందాల్సిన లహుజి, ఆ గుర్తింపు పొందలేకపోయా డు. స్వాతంత్య్రం సాధించాలి అనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి, ‘దేశ స్వాతంత్య్రం కోసం వీరమరణమో లేదా ప్రాణం ఉన్నంతవరకు దేశం కోసమే జీవించడమో’ అను ప్రతిజ్ఞకు కట్టుబడి, వివాహం చేసుకోకుండా జీవితాన్నంతా దేశ సేవకై అంకితం చేసిన ప్రథమ భారత స్వాతంత్య్ర సమరయోధుడు అయిన లహుజి సాళ్వే జన్మదినోత్సవం అయిన నవంబర్ 14వ తేదీని ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’ గా ప్రకటించి, స్వాతంత్య్ర దినోత్సవం రోజున వివిధ మహనీయులతో పాటుగా ఇతని ప్రతిమకు కూడా సరైన స్థానం ఇస్తూ, గౌరవం ఇవ్వడమే మనం ఆ మహాపురుషునికి అందించే నిజమైన నివాళి.
వ్యాసకర్త:
గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్,
రాష్ట్ర అధ్యక్షులు, మాంగ్ సమాజ్ తెలంగాణ
మొబైల్ నంబర్ : 8106549807