ప్రజాందోళనకు విజయం
Dec 29,2024 00:16
గుంటూరులో స్మార్ట్ మీటర్లు తొలగింపు
: పేదల ఇళ్లకు ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గిన అధికారులు శనివారం ఆయా స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను తొలగించారు. గుంటూరు 41వ డివిజన్, పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లోని పేదల ఇళ్లకు ఇటీవల యజమానులు ఇంటిలో లేని సమయంలో దాదాపు 16 స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. దీంతో స్మార్ట్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎపిసిపిడిసిఎల్ ఎస్ఇ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ప్రజాందోళనకు తలొగ్గిన అధికారులు శనివారం మీటర్లను తొలగించారు. వాటి స్థానంలో పాత మీటర్లను తిరిగి బిగించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, నగర కార్యదర్శి కె.నళినీకాంత్ తదితరులు కాలనీ ప్రజలను కలిసి అభినందించారు. గుంటూరులో పోరాడి విజయం సాధించిన బాటలోనే ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకోవాలని, నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. జనవరి 7న నుండి విద్యుత్ నియంత్రణ మండలి జరిపే బహిరంగ విచారణలో ప్రజలు పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలి కోరారు. స్మార్ట్ మీటర్ల ద్వారా రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు భారీగా పెరుగుతాయని, గంటకొక రేటు నిర్ణయించి వసూలు చేస్తారని తెలిపారు. కార్యక్రమం లో షేక్ ఖాశిం షహీద్, లూథర్ పాల్, షేక్ మస్తాన్ వలి, కె ఆంజనేయులు, యం.వెంకట నర్సయ్య పాల్గొన్నారు.