ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని
`ఆటో కార్మికుల ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్
`వచ్చే నెల 16న ఎమ్మెల్యేల కార్యాలయాల ఎదుట ధర్నా, వినతి పత్రాల సమర్పణ
విజయవాడ:
రాష్ట్రంలో ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు శనివారం విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవీంద్రనాధ్ ధర్నాను ఉద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆటో మిత్ర పథకం కింద రూ.15వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. అలాగే జరిమానాల పేరుతో కార్మికులపై భారాలు మోపే జీవో 21, జీవో 31 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జరిమానాలు గతంలో కంటే వెయ్యి రెట్లు పెంచటంతో రోజంతా కష్టపడినా ఇంటికి డబ్బులు తీసుకెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఆటో కార్మికులు నిత్య జీవనానికి వృత్తిని కొనసాగించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, వరద సాయం పెంపు కోరుతూ డిసెంబరు 16వ తేదిన ఎమ్మెల్యే కార్యాలయాల ముందు ధర్నా వినతి పత్రాలు సమర్పణ చేయన్నుట్లు చెప్పారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల సందర్భంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు పై నిర్ణయం తీసుకోవాలన్నారు. సహకారం సంఘం ద్వారా ఆటో స్పేర్ పార్టులు అందించాలని కోరారు. ఫెడరేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఆటో ఫైనాన్స్ వేధింపులు భరించలేక తమ ఆటోలనే దహనం చేసుకునే పరిస్థితికి ఆటో కార్మికులు చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నాగులు అనే ఆటో కార్మికుడు ఫైన్సాన్ వేధింపులతో ఆటోను తగులబెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వరదలతో నస్టపోయిన ఆటోకార్మికులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. విజయవాడ వరద బాధిత ఆటో కార్మికులకు వరద సాయం 25 వేల రూపాయలకు పెంచాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు ఎర్ర రాము, ప్రధాన కార్యదర్శి గూడెల జనార్ధన్, సహాయ కార్యదర్శి పెండ్ర సుబ్రహ్మణ్యం, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకచ్చి, ఫెడరేషన్ నాయకులు సంగుల పేరయ్య, మంగం శ్రీనివాస్,ఈశ్వర్, ప్రమీల శివ,హసన్ చారి, రాజేష్, నాగేశ్వరరావు, వెంకట్ రెడ్డి ,పచ్చల శ్రీను, నాగేశ్వరరావు, కొండ, తదితరులు పాల్గొన్నారు.