ఉరేసుకుని యువతి ఆత్మహత్య
ఎల్లారెడ్డి, సెప్టెంబర్11(ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి మండలం సబ్దల్పూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సావిత్రి (19) అనే యువతి తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం వరకు సాధారణంగా ఉన్న ఆమెను, మధ్యాహ్నం సమయంలో బయట పనులకెళ్లి తిరిగి ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు ఫ్యాన్‌కి ఉరేసుకొని మృతిచెందిన స్థితిలో గుర్తించారు.
ఈ సంఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సావిత్రి తన ఆత్మహత్యకు కారణంగా ప్రేమించి మోసం చేసిన యువకుడి పేరును ఒక సూసైడ్ నోట్‌లో రాసి ఉంచిందని పోలీసులు తెలిపారు.
స్థానిక ఎస్‌ఐ బొజ్జ మహేష్ మాట్లాడుతూ, “సావిత్రి ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో ఒక యువకుడి పేరు స్పష్టంగా పేర్కొంది. ఆమెను ప్రేమించి వంచించాడని ఆ నోట్‌లో రాసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాం” అని తెలిపారు.
యువతి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.