ఒకే ఆఫీస్ లో.. ఐదుగురి పై… ఏసీబీ దాడి..!!

  • రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో లంచాల పరంపర
  • ఒకే కార్యాలయంలో ఐదుగురు అధికారులు ఏసీబీకి చిక్కారు
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నా… లంచాల తంతు మాత్రం ఆగడం లేదు

రాజేంద్రనగర్, జూలై 26:

రాజేంద్రనగర్ మున్సిపాలిటీ కార్యాలయం లంచాల కేంద్రంగా మారిందనే ఆరోపణలకు తాజాగా పట్టుబడిన వరుస ఘటనలు బలాన్ని ఇస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఒక్కొక్కరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా, అదే కార్యాలయంలో మరికొందరు ఉద్యోగులు అడ్డదారుల్లో డబ్బులు దండుకోవడం మానట్లేదు. ఇటీవల ఐదుగురు అధికారులు ఏసీబీకి చిక్కిన ఉదంతాలు సంచలనం రేపుతున్నాయి.

తాజాగా, ఓ హోటల్‌పై దాడి చేసిన అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కె. రవి కుమార్, అందులో రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

అంతకుముందు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకొబా, కొలతల పుస్తకంలో పని నమోదు చేసేందుకు ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అదే మున్సిపాలిటీకి చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ ఎల్. బల్వంత్ రెడ్డి ఓ కాంట్రాక్టర్ బిల్లు మంజూరు కోసం రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

ఇక సర్కిల్ బిల్ కలెక్టర్ సి. మధు తన సహాయకుడు వి. రమేష్ ద్వారా ఓ పరిశ్రమకు చెందిన ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు రూ.1 లక్ష డిమాండ్ చేసి, అందులో రూ.45,000 తీసుకుంటూ పట్టుబడ్డాడు.

ప్రజల నిధులను దోచుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తక్షణమే తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కొక్కరిని పట్టుకుంటున్న ఏసీబీ… మొత్తం వ్యవస్థను పరిశీలించాల్సిన అవసరం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

Join WhatsApp

Join Now