నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్, ఇటుక బట్టి వ్యాపారస్తుల వద్ద పనిచేస్తున్న కార్మికులతో కలిసి నాందేడ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న మారుతి ఈకో వాహనాన్ని డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో కెనాల్‌పై నుంచి కింద పడి మూడు బోల్తా కొట్టింది.
ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఘటనా స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా బైపాస్ రోడ్లపై వేగ పరిమితులను మించవద్దని ప్రజలను హెచ్చరించారు. ఈ ఘటనపై డిచ్పల్లి ఎస్సై, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ తదితరులు పాల్గొన్నారు.

