సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో నలుగురు వ్యక్తులు కాలిన గాయాలతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట రోడ్డులో ఇంటి నంబరు 5-1-8/1లో ఆదివారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇంట్లోని నలుగురు వ్యక్తులు 10 నుండి 15 శాతం వరకు కాలిన గాయాలపాలయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక తహసీల్దార్, సంగారెడ్డి పోలీసులు, సివిల్ సప్లై అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగేలోపే మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం, వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ సంఘటనపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.











