సంగారెడ్డి, జూన్ 27
సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో 54 మంది కార్మికుల మరణానికి కారణమైన ఘోర ప్రమాదం జరిగి జూన్ 30 నాటికి ఏడాది కానుంది. ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నా, బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందలేదని సిఐటియు నాయకులు ఆరోపిస్తున్నారు. మిగిలిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మృత్యువాత పడి ఘటనకు జూన్ 30 నాటికి ఏడాది అవుతుంది. అయినప్పటికీ, బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఇంకా అందలేదని, మిగిలిన మొత్తాన్ని వెంటనే అందజేయాలని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిగాచి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని, నిపుణుల కమిటీ నివేదికలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయని మానిక్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పిస్తామని ప్రకటించారని, సిగాచి కంపెనీ యాజమాన్యం కూడా సెబీకి ఇచ్చిన లేఖలో ఇదే హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
అయితే, ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు మొత్తం 24 కోట్ల 61 లక్షల 21 వేల 290 రూపాయలు మాత్రమే అందిందని, ఇంకా 29 కోట్ల 38 లక్షల 78 వేల 710 రూపాయలు రావాల్సి ఉందని తెలిపారు. ఒక్కో కార్మికుడికి 45 లక్షల నుండి 57 లక్షల వరకు మాత్రమే నష్టపరిహారం అందిందని, ఒక్కో కుటుంబానికి అరకోటికి పైగా రావాల్సి ఉందని అన్నారు. వెంటనే మిగిలిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిగాచి పరిశ్రమ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.











